పన్ను కోత ఆశలతో.. | Tax Cut Expectations Pushes To Sensex And Stock Market Ups | Sakshi
Sakshi News home page

పన్ను కోత ఆశలతో..

Oct 30 2019 12:52 AM | Updated on Oct 30 2019 12:52 AM

Tax Cut Expectations Pushes To Sensex And Stock Market Ups - Sakshi

దీపావళి పండుగ వెళ్లిపోయినా, స్టాక్‌ మార్కెట్లో లాభాల కాంతులు తగ్గలేదు. మరిన్ని ఉద్దీపన చర్యలతో పాటు ఆదాయపు పన్నులో కూడా కోత విధించాలని కేంద్రం భావిస్తోందన్న వార్తలతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం దుమ్ము రేపింది. కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించడం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కానుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో కుమ్మేశారు. సోమవారం బలిపాడ్యమి సెలవు సందర్భంగా ఒక రోజు విరామం తర్వాత ఆరంభమైన ప్రధాన స్టాక్‌ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ మంగళవారం కీలకమైన నిరోధ స్థాయిలపైన ముగియడం విశేషం. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,800 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,750 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నాలుగు నెలల గరిష్టానికి ఎగిశాయి. సెన్సెక్స్‌ 582 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు ఎగసి 11,787 పాయింట్ల వద్ద ముగిశాయి.  టెలికం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల బీఎస్‌ఈ సూచీలు, ఎఫ్‌ఎమ్‌సీజీ  మినహా మిగిలిన అన్ని నిఫ్టీ సూచీలు లాభాల్లోనే ముగిశాయి.  

ఆల్‌టైమ్‌ హైకి రిలయన్స్‌.. 
డిజిటల్‌ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేనున్నామని, వచ్చే ఏడాది కల్లా రిలయన్స్‌ జియోను రుణ భారం లేని కంపెనీగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటూ  రిలయన్స్‌  తెలిపింది. దీంతో మంగళవారం కంపెనీ షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,480 ను తాకింది. చివరకు 2.3% లాభంతో రూ.1,467 వద్ద ముగిసింది.  
మరిన్ని విశేషాలు... 

  • గత క్యూ2 కంటే, ఈ క్యూ2లో నష్టాలు తగ్గడం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌  మళ్లీ లాభాల బాట పట్టటంతో టాటా మోటార్స్‌ జోరుగా పెరిగింది. 17 శాతం లాభంతో రూ.173 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
  • మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లు–భారతీ ఎయిర్‌టెల్, కోటక్‌ బ్యాంక్, పవర్‌ గ్రిడ్, ఎస్‌బీఐ మాత్రమే నష్టపోగా, మిగిలిన 27 షేర్లు లాభపడ్డాయి.  
  • 80కు పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు ఎగిశాయి. వీటిల్లో 30కు పైగా షేర్లు ఆల్‌ టైమ్‌హైలను తాకాయి. రిలయన్స్, అబాట్‌ ఇండియా, జిల్లెట్‌ ఇండియా, ఫైజర్, ఎస్‌బీఐ లైఫ్, ముత్తూట్‌ ఫైనాన్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

లాభాలు ఎందుకంటే... 

  • మరిన్ని ఉద్దీపన చర్యలు..: దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ), సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ), డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ– ఈ ట్యాక్స్‌ను రద్దు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి)లపై ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే చర్యలను కేంద్రం తీసుకోనున్నదని వార్తలు వచ్చాయి.  దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.  
  • ఆదాయపు పన్ను కోత..: వ్యక్తిగత ఆదాయపు పన్నులో కోత విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. ఆదాయపు పన్ను  భారం తగ్గితే వినియోగిం పుంజుకుంటుందనే అంచనాలతో స్టాక్‌ మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి.  
  • అంచనాలను మించుతున్న ఆర్థిక ఫలితాలు...: గత వారం వెల్లడైన ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ఫలితాలను చూపుతోంది. కంపెనీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీల ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలు బలం పుంజుకుంటున్నాయి,  
  • సానుకూల అంతర్జాతీయ సంకేతాలు..:   అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుండటం, బ్రెగ్జిట్‌కు జనవరి దాకా సమయం లభించడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి రేట్లను తగ్గించే అవకాశాలుండటం (దీనిపై నిర్ణయం నేటి రాత్రి వెలువడుతుంది)... వీటన్నింటి కారణంగా ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి.

రూ. 2.73 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద 
లాభాల జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.73 లక్షల కోట్లు ఎగసింది.  బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.2.73 లక్షల కోట్లు ఎగసి రూ.1,52,04,693 కోట్లకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement