‘షట్‌డౌన్‌’గా మారనున్న ‘స్టార్టప్స్‌’

startup industry is angry with Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘షట్‌డౌన్‌ఇండియా, టాక్స్‌టెర్రరిజమ్, షిఫ్ట్‌అవుట్‌ఇండియా’  హాష్‌ టాగ్‌లతో స్టార్టప్‌ ఇండియా వ్యాపార వేత్తలు, వెంచర్‌ క్యాపిటలిస్టుల నుంచి గత కొన్ని వారాలుగా వేలాది విమర్శలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ‘స్టార్టప్‌ ఇండియా’ కంపెనీలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశించామని, అందుకు విరుద్ధంగా పన్నుల మోతతో తమను నంజుకు తింటున్నారని వారు వాపోతున్నారు. పన్ను నోటీసులతో కుమ్ముతున్నారని, బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తున్నారని, ముఖ్యంగా సరైన వివరణలేని నిధులంటూ  పన్ను అధికారులు బ్యాంకుల నుంచి నేరుగా నిధులను స్వాధీనం చేసుకుంటున్నారని వారు లబోదిబోమంటున్నారు. 

‘లోకల్‌ సర్కిల్స్‌ సర్వే’ అధ్యయనంలో 70 శాతం మంది స్టార్టప్‌ కంపెనీల యజమానులు తమకు ఒక్కటైన ‘ఏంజెల్‌ పన్ను’ నోటీసు అందిందని వాపోయారు. తమకు మూడు, నాలుగు నోటీసులు వచ్చాయని వారిలో 30 శాతం మంది యజమానులు వాపోయారు. ఓ కంపెనీ నిర్దారిత విలువకన్నా పెట్టుబడుదారుల నుంచి ఎక్కువ ప్రీమియం వస్తే ఆ ప్రీమియంను లాభంగా పరిగణించి 30 శాతం పన్ను విధించడాన్ని ఏంజెల్‌ పన్నుగా వ్యవహరిస్తారు. రైలు ప్రయాణికులకు భోజనాన్ని సరఫరా చేసే నోయిడాలోని ‘ట్రావెల్‌ఖానా’ స్టార్టప్‌ కంపెనీ నుంచి ఆదాయం పన్ను శాఖ అధికారులు చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 6వ తేదీన 33 లక్షల రూపాయలను ఉపసంహరించుకున్నారు. 

బ్యాంకు ఖాతా నుంచి హఠాత్తుగా డబ్బులు మాయం అవడంతో తాము బ్యాంకుకు వెళ్లి వాకబు చేశామని, ఆ సొమ్మును ఆదాయం పన్ను శాఖ అధికారులు డిమాండ్‌ డ్రాఫ్టుల రూపంలో తీసుకెళ్లినట్లు తెల్సిందని ట్రావెల్‌ ఖానా వ్యవస్థాపకులు పుష్పింధర్‌ సింగ్‌ తెలిపారు. అలాగే వారు భారతీయ స్టేట్‌ బ్యాంకు, ఐసీసీఐ బ్యాంకుల్లోని తమ ఖాతాలను స్తంభింపచేశారని ఆయన వాపోయారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సరైన వివరణ లేని కారణంగా వాటిని తాము అనూహ్య పెట్టుబడులుగా పరిగణించి స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెప్పారని, తమ పెట్టుబడుల్లో నగదు లావాదేవీలే ఉండవని, అన్ని పెట్టుబడులను తాము బ్యాంకు బదిలీల ద్వారానే తీసుకుంటామని ఆయన వివరించారు. అలాంటప్పు అనూహ్య పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన అన్నారు. 

తల్లిదండ్రులకు పిల్లల వైద్యుల సేవలను అనుసంధానించే ఐదేళ్ల క్రితం ప్రారంభమైన స్టార్టప్‌ కంపెనీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఫిబ్రవరి ఆరవ తేదీనే ఈ కంపెనీ బ్యాంకు నుంచి ఆదాయం పన్ను అధికారులు 72 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. భారత దేశంలో ప్రస్తుతం ఏడువేల స్టార్టప్‌ కంపెనీలు పనిచేస్తున్నాయి. 2018లో ఈ కంపెనీలు 420 కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహించాయి. భారత దేశంలో ఐటీ కార్మికులు తక్కువ వేతనాలకు దొరకడం మూలానా 2000 సంవత్సరం తర్వాత ఎక్కువ స్టార్టప్‌ కంపెనీలు వచ్చాయని, సిలికాన్‌ వ్యాలీ నుంచి వెనక్కి వచ్చి టెకీలు అనేక కంపెనీలు పెట్టారని, పెడుతున్నారని స్టార్టప్‌ వ్యాపారులు తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక స్టార్టప్‌ కంపెనీలకు ప్రోత్సహిస్తామని  చెప్పడంతో విశ్వసించామని వారు అంటున్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి మాత్రం నిరుత్సాహంగా ఉందని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము కంపెనీలను షట్‌డౌన్‌ చేసుకోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top