సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే

Siddhartha to be cremated at his coffee estate in Karnataka  - Sakshi

సాక్షి, ముంబై : కాఫీ తోటల్ని ప్రేమించి, మంచి కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కాఫీ కింగ్‌ వీజీ సిద్ధార్థ చివరి ప్రస్థానం కూడా ఆ కాఫీ తోటల మధ్యే ముగియనుంది. 12వేల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ అంత్యక్రియలను కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలోని  చట్టనహళ్లి గ్రామంలోని కాఫీ ఎస్టేట్‌లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు అంత్యక్రియలు  పూర్తికానున్నాయని భావిస్తున్నారు. మంగళూరు నుండి 150 కిలోమీటర్లు,  బెంగళూరుకు వాయువ్యంగా 250 కిలోమీటర్ల దూరంలో ఈ కాఫీ ఎస్టేట్ ఉంది.   

సోమవారం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ మృతదేహాన్ని నేత్రావతి నది వెనుక నీటిలో తేలుతుండగా బుధవారం ఉదయం ఇద్దరు మత్స్యకారులు గుర్తించారు. బంధువులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళూరులోని వెన్‌లాక్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత సిద్ధార్థ మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు.  ఆయన మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో  పోస్ట్‌మార్టం నివేదిక  కీలకంగా మారింది. అయితే పోలీసులు ఈ నివేదికను ఇంకా  బహిర్గతం చేయలేదు.

మరోవైపు వ్యవస్థాపక చైర్మన్‌ అకాల మరణం నేపథ్యంలో కెఫే కాఫీ డే ఔట్‌లెట్లకు సెలవు ప్రకటించారు. మృతదేహాన్ని గ్రామానికి తరలించే మార్గంలో చిక్‌మంగళూరు పట్టణంలోని కాఫీ డే గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయానికి తరలించారు. దీంతో తమ అభిమాన నేత, లెజెండ్‌, కాఫీ డే కింగ్‌ మృతికి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించగా ఆయన మృతదేహాన్ని సందర్శించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచి  చిన్నా, పెద్దా,  మహిళలు వేలాదిగా తరలివచ్చారు.  

తప్పులన్నింటికి నాదే బాధ్యత అంటూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన సిద్ధార్థ ..కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారని చెప్పక తప్పదు.  ప్రధానంగా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖలో ప్రస్తావించిన ఐటీ శాఖ అధికారుల వేధింపులు  వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top