తక్కువ ప్రీమియం... అధిక కవరేజీ

Low premium high coverage - Sakshi

టర్మ్‌ ప్లాన్‌తో కుటుంబానికి భరోసా  

ఆర్థిక సాధనాలు అనగానే ఫిక్సిడ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములు, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రయోజనాలతో కూడిన జీవిత బీమా పాలసీలు, బంగారం.. ప్రాపర్టీలే టక్కున గుర్తొస్తాయి. అయితే, పూర్తిగా జీవిత బీమా కోసమే ఉద్దేశించిన టర్మ్‌ ప్లాన్ల గురించి అంతగా ఆలోచన రాదు. నిజం చెప్పాలంటే బీమా పాలసీల్లో అత్యంత సింపుల్‌ పాలసీ ఇదే. ప్రతి వేతనజీవి పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనమిది.

ఇంటిల్లిపాదీ ఆధారపడే కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే వారికి ఆర్థికంగా భరోసానిచ్చేదే టర్మ్‌ పాలసీ. టర్మ్‌ పాలసీలు చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇచ్చేవే అయినా.. వీటిపై పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఉదాహరణకు.. సిగరెట్‌ అలవాటు లేని 35 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్లకు అత్యధికంగా రూ.1 కోటి రూపాయల కవరేజీ తీసుకున్న పక్షంలో కట్టాల్సిన ప్రీమియం రూ. 8,300 మాత్రమే. టర్మ్‌ ప్లాన్‌ పూర్తయ్యేంత వరకూ ఇంతే ప్రీమియం ఉంటుంది.

ఇది చాలు.. టర్మ్‌ ప్లాన్‌ ఎంత చౌకైనదో తెలియడానికి. ఇక, సిగరెట్‌ అలవాటు లేని 45 ఏళ్ల వ్యక్తి గానీ అదే రూ.1 కోటి కవరేజీ కోసం 30 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే రూ.14,600 కట్టాలి. అంటే పదేళ్ల పాటు వాయిదా వేయడం వల్ల మొత్తం మీద రూ.1.38 లక్షలు అధికంగా కట్టాలి. కాబట్టి.. వీలైనంత వరకూ యుక్త వయస్సులోనే పాలసీ తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి.

కుటుంబానికి ఆర్థిక భరోసా..
పాలసీదారుకు అనుకోనిదేమైనా జరిగితే తనపై ఆధారపడిన కుటుంబసభ్యులు ఆర్థికంగా అవస్థలు పడకుండా ఆదుకుంటుంది టర్మ్‌ ప్లాన్‌. అవసరాలకు అనుగుణమైన ఆప్షన్స్‌తో కూడా టర్మ్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

ఉదాహరణకు.. సమ్‌ అష్యూర్డ్‌ను ఒకేసారి అందుకునే ఆప్షన్‌ లేదా కొంతభాగాన్ని ఒకేసారి, మరికొంత భాగాన్ని నెలవారీ ఆదాయంగాను పొందే ఆప్షన్స్‌ కూడా ఉంటున్నాయి. ఒకవేళ మెచ్యూరిటీ గడువు తీరేదాకా పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో అప్పటిదాకా కట్టిన ప్రీమియంలను తిరిగి చెల్లించే పాలసీలూ ఉన్నాయి. ఇక, నెలవారీగానూ లేదా వార్షికంగాను అందుకునే మొత్తం నిర్దిష్ట శాతం మేర పెరుగుతూ ఉండే ఆప్షన్‌ కూడా ఇస్తున్నాయి బీమా కంపెనీలు.

ఎంత కవరేజీ..
సాధారణంగా ప్యూర్‌ టర్మ్‌ పాలసీని ఎంచుకునేటప్పుడు ఎంత కవరేజీ తీసుకోవాలన్న దానికి సంబంధించి కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఆదాయం, కుటుంబం జీవన విధానం, ఆస్తులు, అప్పులు మొదలైనవాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. బండగుర్తుగా చెప్పాలంటే.. స్థూల వార్షికాదాయానికి కనీసం పది రెట్లయినా కవరేజీ ఉండాలి. ఒకవేళ భారీ రుణాలున్నాయంటే.. ఇది మరింత ఎక్కువగా ఉండాలి.

ఆదాయ పన్ను మినహాయింపులకు సంబంధించి సెక్షన్‌ 80సీ పరంగా చూసినా.. భారీ రాబడులిచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా చూసినా టర్మ్‌ ప్లాన్లు అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు. కానీ, పాలసీదారుకు ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడిపోకుండా ఆదుకునే ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

- రిషి శ్రీవాస్తవ ,టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top