జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట! | Sakshi
Sakshi News home page

జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట!

Published Wed, Jul 24 2019 8:17 AM

IMF Review on Indian GDP Growth - Sakshi

వాషింగ్టన్‌: భారత్‌ దేశీయ వినియోగ డిమాండ్‌ అవుట్‌లుక్‌అంచనాలకన్నా బలహీనంగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఈ ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ కారణంగా 2019, 2020కి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.3 శాతం (30 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 2019లో 7 శాతం, 2020లో 7.2 శాతం వృద్ధి రేట్లు మాత్రమే నమోదవుతాయన్నది తమ తాజా అంచనా అని తెలిపింది. అయితే ఈ స్థాయి వృద్ధి నమోదయినా, ప్రపంచంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని, చైనా తరువాతి స్థానంలోనే ఉంటుందని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ దిగ్గజ ద్రవ్య సంస్థ పేర్కొంది. తన తాజా వరల్ట్‌ ఎకనమిక్‌ అప్‌డేట్‌ నివేదికలో భాగంగా భారత్‌కు సంబంధించి ఐఎంఎఫ్‌ ఈ అంశాలను పేర్కొంది. భారత్‌ సంతతికి చెందిన ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఆవిష్కరించిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

పన్నుల భారాలు పెరగడం, అంతర్జాతీయ డిమండ్‌ బలహీనపడ్డం, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల వంటి అంశాలతో చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంటోంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి చైనా పలు విధానపరమైన ఉద్దీపన చర్యలు తీసుకుంటోంది. ఆయా చర్యల ఫలితంగా చైనా 2019లో 6.2 శాతం 2020లో 6 శాతం వృద్ధి రేట్లను నమోదుచేసుకునే అవకాశం ఉంది. (ఏప్రిల్‌లో వెలువడిన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ అంచనాలకన్నా 10 బేసిస్‌ పాయింట్లు తక్కువ)
అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక అనిశ్చితి ఉంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరుమీద మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల ఆధారపడి ఉంటుంది.  
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ప్రపంచ వాణిజ్యం కూడా నెమ్మదించింది. ప్రపంచ వాణిజ్యం ఈ కాలంలో కేవలం 0.5 శాతం మాత్రమే పురోగమించింది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు 2012 తర్వాత ఇదే తొలిసారి.  
అమెరికా–చైనాల మధ్య సుంకాల పోరు, ఆటో టారిఫ్‌లు, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వెలుపలికి రావడానికి సంబంధించిన బ్రెగ్జిట్‌ అంశాలు అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయి. పెట్టుబడులు, సరఫరా చైన్లను ఈ పరిస్థితి దెబ్బతీసే అవకాశం ఉంది.  
అయితే ఈ పరిస్థితిని ‘అంతర్జాతీయ మాంద్యంగా’ మాత్రం ఐఎంఎఫ్‌ పరిగణించబోవడం లేదు. ప్రపంచ వృద్ధికి ‘కీలక అవరోధాలు’గా మాత్రమే దీనిని ఐఎంఎఫ్‌ చూస్తోంది.  
అమెరికా–చైనా మధ్య వాణిజ్య సవాళ్లు 2020లో ప్రపంచ జీడీపీని 0.5 శాతం  మేర తగ్గించే అవకాశం ఉంది.  
ద్వైపాక్షిక వాణిజ్య సమతౌల్యతలు, వాణిజ్యలోటు సమస్యల పరిష్కారానికి సుంకాలే మార్గమని భావించడం సరికాదు. ఆయా సవాళ్ల పరిష్కారానికి నిబంధనల ఆధారిత బహుళజాతి వాణిజ్య వ్యవస్థ మరింత పటిష్టం కావాలి.

Advertisement
Advertisement