భారత్‌లో డిమాండ్‌ బంగారం

Gold Demand in India 13 Percent Growth in Q2 - Sakshi

క్యూ2లో 13 శాతం పెరుగుదల 213 టన్నులుగా నమోదు

ఆకర్షణీయ ధరలు, పర్వదినాలతో పెరిగిన కొనుగోళ్లు

ఆర్‌బీఐకి కూడా పసిడి ఆకర్షణ ∙వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక

ముంబై: బంగారానికి ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో (క్యూ2) దేశంలో మంచి డిమాండ్‌ నమోదయ్యింది. 2018 ఇదే కాలంతో పోల్చితే డిమాండ్‌ 13 శాతం పెరిగి 213 టన్నులకు చేరింది. సంబంధిత మూడు నెలల్లో పర్వదినాలు, అలాగే ఆకర్షణీయమైన ధరలు పసిడి కొనుగోళ్లను పెంచినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. కౌన్సిల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) సోమసుందరం నివేదికలో అంశాలను వెల్లడించారు.  కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
2018 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో పసిడికి డిమాండ్‌ 189.2 టన్నులు. అంటే 2019 ఇదే కాలంలో 13 శాతం పెరిగి, 213 టన్నులుగా నమోదయ్యిందన్నమాట.
విలువ రూపంలో చూస్తే, పసిడి డిమాండ్‌ 17 శాతం పెరిగి రూ.53,260 కోట్ల నుంచి రూ.62,422 కోట్లకు ఎగసింది.  
ఆభరణాలకు డిమాండ్‌ 12 శాతం పెరిగి, 149.9 టన్నుల నుంచి 168.6 టన్నులకు చేరింది.  
విలువలో ఆభరణాలను చూస్తే, 17 శాతం పెరిగి రూ. 42,200 కోట్ల నుంచి రూ.49,380 కోట్లకు చేరింది.  
పెట్టుబడుల డిమాండ్‌ 13 శాతం పెరిగి 39.3 టన్నుల నుంచి 44.5 టన్నులకు చేరింది.  
పెట్టుబడులకు సంబంధించి విలువ 18 శాతం పెరుగుదలతో రూ.11,060 కోట్ల నుంచి 13,040 కోట్లకు ఎగసింది.  
గోల్డ్‌ రీసైకిల్డ్‌ విలువ 18 శాతం ఎగసి 32 టన్నుల నుంచి 37.9 టన్నులకు ఎగసింది.  
కడ్డీలు, నాణేల డిమండ్‌ భారీగా ఐదేళ్ల గరిష్టాన్ని తాకడం గమనార్హం.  
నెలల వారీగా ఏప్రిల్, మేలలో డిమాండ్‌ భారీగా ఉన్నా, జూన్‌లో దాదాపు యథాతథ స్థాయిలో ఉంది. ధరలు పెరగడం, బడ్జెట్‌లో ఎగుమతుల సుంకం మరింత పెంచే అవకాశం ఉందన్న వార్తలు దీనికి కారణమయ్యాయి.  
జనవరి–జూన్‌ దేశంలో పసిడి డిమాండ్‌ 9 శాతం పెరిగి 372.2 టన్నులుగా నమోదయ్యింది. ఆర్థిక మందగమనం, ఎన్నికల సీజన్‌ నేపథ్యంలో నగదు కదలికలపై ఆంక్షలు వంటి ప్రతికూలతలు ఉన్నా... ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం గమనార్హం.  
2019 గడచిన ఆరు నెలల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 17.7 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. 2018 ఇదే కాలంలో ఈ పరిమాణం 8.1 టన్నులు మాత్రమే.
కాగా త్రైమాసిక కాలంలో డిమాండ్‌కు తగ్గట్టుగా పసిడి దిగుమతులు జరగలేదు.   
2017 తొలి త్రైమాసికం నుంచీ దేశంలో పసిడి సరఫరా బాగుంది. భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో... రీసైక్లింగ్‌ కూడా ఊపందుకునే వీలుంది.  
కస్టమ్స్‌ సుంకాల పెంపు భారత్‌లో పడిసి డిమాండ్‌పై దీర్ఘకాలం ఉంటుందని భావించడం లేదు. అయితే మూడవ త్రైమాసికంలో మాత్రం కొంత కనబడవచ్చు. తరువాత డిమాండ్‌ పుంజుకుంటుంది.
2019 మొత్తంలో పసిడి డిమాండ్‌ 750 నుంచి 850 టన్నుల వరకూ ఉంటుందని అంచనా.

ప్రపంచ వ్యాప్త డిమాండ్‌ 1,123 టన్నులు
ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో పసిడి డిమండ్‌ 8 శాతం పెరిగి 1,123 టన్నులుగా నమోదయ్యింది. సెంట్రల్‌ బ్యాంకులు భారీగా పసిడిని కొనుగోలు చేయడం, పసిడి ఆధారిత ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ పెట్టుబడులు  ఎనిమిది శాతం వృద్ధికి కారణం. 2018 రెండవ త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్త పసిడి డిమాండ్‌ 1,038.8 టన్నులని డబ్ల్యూజీసీ క్యూ2 గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదిక వివరించింది. సెంట్రల్‌ బ్యాంకుల డిమాండ్‌ 67 శాతం పెరిగి 152.8 టన్నుల నుంచి 224.4 టన్నులకు చేరింది. పోలాండ్‌ భారీగా 100 టన్నులు కొనుగోలు చేసింది. ఈ విషయంలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే రష్యాను వెనక్కు నెట్టింది. ఈటీఎఫ్‌ల పెట్టుబడులు భారీగా ఉన్నా కేవలం పెట్టుబడులకు పసిడి డిమాండ్‌ ఒకశాతమే పెరిగింది. యూరోప్, చైనాల్లో 12 కడ్డీలు, నాణేలు డిమాండ్‌ పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈటీఎఫ్‌ల పెట్టుబడులు 67.2 టన్నులు పెరిగి 2,548 టన్నులుగా నమోదయ్యింది. ఇది ఆరేళ్ల గరిష్టస్థాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, సెంట్రల్‌ బ్యాంక్‌ల సరళతర విధానాలు పసిడి ధరలకు జూన్‌లో ఊతం ఇచ్చాయి. ఆభరణాల డిమాండ్‌ 2 శాతం పెరిగి 520.8 టన్నుల నుంచి 531.7 టన్నులకు ఎగసింది. భారత్‌ మార్కెట్‌ రికవరీ దీనికి ప్రధాన కారణం. పసిడి సరఫరా 6 శాతం ఎగసి, 1,121.3 టన్నుల నుంచి 1,186.7 టన్నులకు ఎగసింది. పసిడి గనుల ఉత్పత్తి 882.6 టన్నులు. రీసైక్లింగ్‌ 9 శాతం పెరిగి 314.6 టన్నులకు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top