రెరాతో రేట్లు పెరగవు!

Do not increase rates with RERA! - Sakshi

నిర్మాణంలో నాణ్యత; గడువులోగా పూర్తవుతాయ్‌...

రూ.40 లక్షల వరకూ అందుబాటు గృహాలే

నిర్మాణంలో 50 వేల ఫ్లాట్లు; ఇందులో 50% అవే

రెండేళ్లలో 9 కోట్ల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి

ఇన్వెంటరీ పెరగడానికి కారణం జేవీ ప్రాజెక్ట్‌లే

క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ రాంరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో ప్రాపర్టీ ధరలు పెరగవు. ఇదొక నియంత్రణ సంస్థ మాత్రమే. ఇందులోని నిబంధనలతో డెవలపర్లలో క్రమశిక్షణ అలవడుతుంది. నాణ్యమైన ఉత్పత్తుల వాడకంతో క్వాలిటీ నిర్మాణాలుంటాయి. పైగా నిబంధనల అతిక్రమణ, నిధుల మళ్లింపు వంటివేవీ లేకుండా నిర్మాణాలు గడువులోగా పూర్తవుతాయని క్రెడాయ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌. రాంరెడ్డి తెలిపారు.  

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కారణంగా స్థిరాస్తి ధరలు పెరిగే అవకాశముంది. సిమెంట్, ఇనుము, రంగులు, టైల్స్‌ వంటి నిర్మాణ సామగ్రిపై పన్నులు గతంలో కంటే జీఎస్‌టీలో  అధికంగా కేటాయించారు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఫలితంగా చ.అ. ధరలూ పెరుగుతాయి. ప్రస్తుతం అపార్ట్‌మెంట్లకు జీఎస్‌టీని 12 శాతంగా కేటాయించారు. దీన్ని 5 శాతానికి తగ్గించాల్సిన అవసరముంది.
 2008–09లో నగరంలో ఎంతైతే ధరలున్నాయో 2018లోనూ అవే ధరలున్నాయి. కానీ, స్థలాలు, నిర్మాణ సామగ్రి ధరలు కార్మికుల వేతనాలు, అనుమతులు, పన్నులు ఇతరత్రా ఖర్చు లు మాత్రం ఐదింతలు పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుం చి సానుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో 20% ధరలు పెరిగాయి. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 10–15% వరకు ధరలు పెరుగుతాయి. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల్లో కంటే కొత్తగా వచ్చే ప్రాజెక్ట్‌ల్లోనే చ.అ. ధరలు పెరుగుతాయి.
ఇన్వెస్టర్లయినా, సామాన్య, మధ్యతరగతి ప్రజలైనా సరే ముందుగా కొనుగోలు చేసేది స్థలాలే. అందుకే అభి వృద్ధి తాలూకు పరిస్థితులు కనిపించగానే ముందుగా పెరిగేవి స్థలాల ధరలే. తర్వాతే నివాస సముదాయాల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్‌లో స్థలాల ధరలు పెరిగేందుకు ప్రధాన కారణం.. మౌలిక వసతుల అభివృద్ధి, మెట్రో రైల్‌ కనెక్టివిటీ, ఓఆర్‌ఆర్‌ రేడియల్‌ రోడ్ల అభివృద్ధి.
 వచ్చే రెండేళ్లలో నగరంలో 9 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది. దీన్లో సుమారు కొత్తగా లక్ష ఉద్యోగాలొస్తాయి. రియల్టీ పరిభాషలో 1 నాణ్యమైన ఉద్యోగి వస్తే దానికి అనుబంధంగా 7–8 ఉద్యోగ అవకాశాలొస్తాయి. దోబీ, డ్రైవర్, అడ్మినిస్ట్రేషన్‌ స్టాప్‌ వంటివాళ్లన్నమాట. వీళ్లందరికీ కొనేందుకైనా, అద్దెకుండేందుకైనా ఇళ్లు కావాలి. అంటే వచ్చే రెండేళ్లలో 4–5 లక్షల ఇళ్లకు డిమాండ్‌ ఉంటుందని అంచనా.

రూ.40 లక్షల్లోపూ అందుబాటు గృహాలే..
రూ.40 లక్షల లోపు ధర ఉండే గృహాలన్నీ అందుబాటు గృహాల పరిధిలోకే వస్తాయి. ఈ తరహా ఇళ్లకు ఎల్లప్పుడూ డిమాండ్‌ ఉం టుందని, ప్రతికూల సమయంలోనూ అమ్మకాలుంటాయి. నగరం లో అనుమతులొచ్చి నిర్మాణంలో ఉన్న గృహాలు సుమారు 45–50 వేల యూనిట్లుంటాయి. వీటిల్లో 50% గృహాలు రూ.40 లక్షల్లోపే.
 అమ్ముడుపోకుండా ఇన్వెంటరీ పెరగడానికి కారణం జాయింట్‌ డెవలప్‌మెంట్‌ వెంచర్లే. జేవీ ప్రాజెక్ట్‌లో డెవలపర్‌ తాలూకు ఫ్లాట్లను విక్రయించేస్తాడు. కానీ, ల్యాండ్‌ ఓనర్‌ తాలూకు ఫ్లాట్లలో 30–35% మాత్రమే విక్రయించేస్తాడు. మిగిలిన వాటిని భవిష్యత్తు అవసరాల కోసం తన వద్దే ఉంచుకుంటాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top