జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌కు చుక్కెదురు

Delhi High Court dismisses GVK plea to stop stake sale in Mumbai Airport - Sakshi

వాటా విక్రయానికి బిడ్‌వెస్ట్‌కు

ఢిల్లీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

వాటా కొనుగోలు రేసులో అదానీ?

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వాటాను 74 శాతానికి పెంచుకోవాలనుకున్న జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు తీర్పుతో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్‌వెస్ట్‌ గ్రూప్‌నకు ఊరట లభించింది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్‌) ఈ గ్రూప్‌ కంపెనీ అయిన బిడ్‌ సర్వీసెస్‌ డివిజన్‌కు (మారిషస్‌) ఉన్న 13.5 శాతం వాటాను థర్డ్‌ పార్టీకి విక్రయించుకోవచ్చని జస్టిస్‌ సంజీవ్‌ నరూలా తీర్పు వెలువరించారు. అంతేగాక వాటా విక్రయాన్ని నిలిపివేయాలంటూ గతంలో ఇదే కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. బిడ్‌ సర్వీసెస్‌ డివిజన్‌ నుంచి వాటా కొనుగోలు విషయంలో డీల్‌ను సకాలంలో పూర్తి చేసే ఉద్దేశం జీవీకే కంపెనీ కనబరచలేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే బిడ్‌ సర్వీసెస్‌ వాటాను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్‌ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం.

ఇదీ కేసు నేపథ్యం..
ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తనకున్న వాటాను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్‌ ఒకరు ఆసక్తి కనబరుస్తున్నారంటూ జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌కు కొన్ని నెలల క్రితం బిడ్‌ సర్వీసెస్‌ డివిజన్‌ నోటీసు ఇచ్చింది. దీంతో రైట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ రెఫ్యూజల్‌ అస్త్రాన్ని జీవీకే ప్రయోగించింది. బిడ్‌వెస్ట్‌ వాటాతోపాటు ఏసీఎస్‌ఏ గ్లోబల్‌ నుంచి 10 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు జీవీకే కసరత్తు చేసింది. ఈ ప్రక్రియ పూర్తి అయితే జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ వాటా 50.5 శాతం నుంచి 74 శాతానికి చేరుతుంది.

ఈ డీల్‌ కోసం జీవీకే రూ. 2,171.14 కోట్లు చెల్లించాలి. అయితే నిధులు లేకపోవడంతో డీల్‌ పూర్తి చేసేందుకు సెప్టెంబర్‌ 30 వరకు సమయం ఇవ్వాలని బిడ్‌వెస్ట్‌ను జీవీకే కోరింది. అంత వరకు వేచి చూసేది లేదని, ఇన్వెస్టర్‌ పెట్టుబడితో సిద్ధంగా ఉన్నారంటూ బిడ్‌వెస్ట్‌ తేల్చి చెప్పింది. దీంతో జీవీకే కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. తాజాగా కోర్టు తీర్పుతో బిడ్‌వెస్ట్‌ వాటా విక్రయానికి అడ్డంకులు తొలగిపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top