లాక్‌డౌన్‌ మూల్యం రూ.9 లక్షల కోట్లు

Corona Impact India May Lose Rs 9 Lakh Crore In Covid-19 - Sakshi

జీడీపీలో 4 శాతం మేర ప్రభావం

2020–21 వృద్ధి 3.5 శాతం: బార్‌క్లేస్‌

ముంబై: కోవిడ్‌ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్‌ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడు వారాల పాటు దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 120 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9 లక్షల కోట్లు) మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ఇది భారత జీడీపీలో 4 శాతానికి సమానమని పేర్కొంది. మూడు వారాల లాక్‌డౌన్‌ వల్ల నష్టమే 90 బిలియన్‌ డాలర్లు ఉంటుందని, దీనికి అంతకుముందే పలు రాష్ట్రాల్లో లౌక్‌డౌన్‌ ప్రభావం అదనమని వివరించింది. కాగా, దేశవ్యాప్త లౌక్‌డౌన్‌ నిర్ణయం బుధవారం ఈక్విటీ మార్కెట్లను ఏ మాత్రం ప్రభావితం చేయకపోవడం గమనార్హం.  

వృద్ధికి దెబ్బ...: అలాగే, 2020–21 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను 1.7 శాతం మేర తగ్గించి 3.5 శాతంగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో బార్‌క్లేస్‌ పేర్కొంది.   

వడ్డీ రేట్లకు భారీగా కోత..: ఆర్‌బీఐ ఏప్రిల్‌ 3న తన విధాన ప్రకటనను విడుదల చేయనుంది. ఆ సందర్భంగా కీలక రేట్లను 0.65 శాతం తగ్గించే అవకాశాలున్నాయని, ఈ ఏడాది మిగిలిన కాలంలో మరో ఒక శాతం వరకు రేట్లను తగ్గించొచ్చని తెలిపింది.  ద్రవ్యలోటు కూడా లక్ష్యాన్ని దాటిపోతుందని బార్‌క్లేస్‌ పేర్కొంది. ద్రవ్యలోటు 5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.  

ఆర్థిక చర్యల్లేవు..: ఇతర దేశాలతో పోలిస్తే ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలను బ్రోకరేజీ సంస్థ ఎడెల్‌వీజ్‌ అభినందిస్తూనే.. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు లోపించాయని పేర్కొంది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా పడే ప్రభావం విషయమై కేంద్ర సర్కారు మౌనం దాల్చినట్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే డీమోనిటైజేషన్, జీఎస్‌టీ నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగాన్ని కోవిడ్‌ మహమ్మారి మరింత అగాధంలోకి నెట్టేసినట్టయిందని పేర్కొంది. మానిటరీ పరంగా ఎన్నో చర్యలు అవసరమని సూచించింది.

క్యూ4లో వృద్ధిరేటు 1.5–2.5 శాతమే!
లాక్‌డౌన్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రతికూల ప్రభావం చూపుతుందని కేర్‌ రేటింగ్స్‌ తాజా నివేదికలో అంచనావేసింది.  21 రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో  నిత్యావసర సేవలు, వ్యవసాయ రంగం (20% ఉత్పత్తి) మినహా 80 శాతం ఉత్పత్తి నష్టం జరుగుతుందని వివరించింది. ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని విశ్లేషించింది. మొత్తంగా రూ.6.3 లక్షల కోట్ల నుంచి  రూ.7.2 లక్షల కోట్ల వరకూ ఎకానమీ దెబ్బతింటుందని అంచనావేసింది. 2019–20 లో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.140 లక్షల కోట్ల నుంచి రూ. 150 లక్షల కోట్ల వరకే ఉంటుందని అంచనావేసింది. పరిస్థితి చూస్తుంటే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) మైనస్‌లోకి వెళ్లే అవకాశంలేదుకానీ, 1.5–2.5 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top