దివాలా చట్టంతో ఫలితాలొస్తాయ్‌

 bankruptcy law results - Sakshi

భారీ ఎన్‌పీఏ కేసుల్లో 40 శాతం వరకు రికవరీ

ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువ అవసరం లేదు

విలీనాలకు ఇది సరైన తరుణం కాదు

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ వ్యాఖ్యలు  

న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి నూతన చట్టంతో ఎదురయ్యే సవాళ్లు లక్ష్యానికి అడ్డంకి కాబోవని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ఇది కొత్త చట్టమని, ఫలితాలు రావాల్సి ఉందని చెప్పిన రజనీష్‌... ఇది నిరాశపరచబోదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తుది నిర్ణయం మాత్రం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలోనే ఉందన్నారు. భారీ రుణ ఎగవేత కేసులను ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద పరిష్కరించడానికి ఎన్‌సీఎల్‌టీకి ప్రతిపాదించించేందుకు ఆర్‌బీఐ గతేడాది అనుమతించిన విషయం తెలిసిందే. ఐబీసీ కింద రుణదాతల కమిటీ ఆమోదించిన పరిష్కార ప్రణాళికే తుది నిర్ణయం కాదన్న రజనీష్‌కుమార్‌... అంతిమంగా ఇది న్యాయపరమైన ప్రక్రియగా పేర్కొన్నారు. ఆర్‌బీఐ రెండు జాబితాల్లో చర్యల కోసం సూచించిన కేసుల నుంచి 40 శాతం బకాయిలు వసూలు కావచ్చని చెప్పారు. వసూళ్లకు సంబంధించి కచ్చితమైన అంచనాలేవీ ఉండవన్నారు. రూ.8 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిల భారాన్ని దేశీయ బ్యాంకులు మోస్తున్న విషయం తెలిసిందే. దీంతో సమస్యాత్మక రుణాన్ని 180 రోజుల్లోగా పరిష్కరించుకోని పక్షంలో ఎన్‌సీఎల్‌టీకి ప్రతిపాదించాలని ఆర్‌బీఐ గత నెలలోనే బ్యాంకులను ఆదేశించింది. 

విద్యుత్‌ రంగానికి పునర్వైభవం...
విద్యుత్‌ రంగానికి ఇచ్చిన రుణాల వసూళ్లలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరిస్తామని రజనీష్‌ కుమార్‌ చెప్పారు. సమస్యలను పరిష్కరించుకునేందుకు రుణదాతలు సమష్టిగా వ్యవహరిస్తారని చెప్పారు. వచ్చే రెండేళ్ల కాలంలో విద్యుత్‌కు కొరత ఏర్పడుతుందని, దీంతో ఉన్న ప్లాంట్లకు మెరుగైన విలువ సమకూరుతుందని పేర్కొన్నారు. తద్వారా విద్యుత్‌ రంగానికి ఇచ్చిన రుణాలు సమస్యాత్మకం కాబోవన్న సంకేతమిచ్చారు. మార్చి త్రైమాసికంలో ఎన్‌పీఏలు డిసెంబర్‌ క్వార్టర్‌ కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. ప్రభుత్వరంగంలో ఎక్కువ బ్యాంకులు అవసరం లేదన్న దానితో ఏకీభవిస్తున్నట్టు రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య తగ్గితే వినియోగదారులకు నష్టం జరగదంటూనే... ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు ఇది సరైన తరుణం కాదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కస్టమర్ల సేవల అనుభవం, పరిపాలన మెరుగుపడేందుకు ఎంతో అవకాశం ఉందని చెప్పారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top