వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం

వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం - Sakshi

 •  మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు

 •  విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు

 •  టీడీపీ ప్రలోభాల పర్వానికి కళ్లెం

 • గుడివాడ : వైఎస్సార్‌సీపీకి స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందించింది. ఈ మేరకు శుక్రవారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు గాను ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన అభ్యర్థులందరికీ విప్ వర్తిస్తుంది.  ఇప్పటికే ప్రత్యర్థి టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీకి విప్ జారీ అవకాశం లేదని, కాబట్టి తమ పార్టీకి మద్దతు ప్రకటించాలని కొన్నిచోట్ల ప్రలోభాలకు తెర తీశారు. స్వల్ప ఆధిక్యత ఉన్నచోట్ల ఈ ప్రలోభాల పర్వం ఇప్పటికే కొనసాగింది. ఈ నేపథ్యంలో విప్ జారీ చేసే అవకాశం రావటంతో వీరి ప్రలోభాలకు తెరపడినట్లయింది.

   

  విప్ జారీ చేస్తే అనర్హతే..


  జూలై మూడున జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జూలై నాలుగున జరగనున్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో, జూలై ఐదున జరిగే జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సభ్యులు ప్రవర్తిస్తే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశముంటుంది.

   


  విప్ జారీ చేసే పార్టీ ఆదేశాలకే కట్టుబడి ఉండాలి...

   


  ఏదైనా పార్టీ విప్ జారీ చేస్తే ఆ పార్టీ ఎన్నిక సందర్భంగా ఎవరికి ఓటు వేయమంటే ఆ అభ్యర్థికే ఓటు వేయాల్సి ఉంటుంది.

   


  పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా విప్‌ను వ్యతిరేకించినట్లే అవుతుంది.

   


  విప్ జారీ చేసినపుడు ఆ సమావేశానికి ఎన్నిక సందర్భంగా హాజరు కాకపోయినా విప్ ధిక్కారం కింద అనర్హత వర్తిస్తుంది.

   


  విప్ జారీ చేసినపుడు ఆ పార్టీ చెప్పిన వ్యక్తి ఓటు వేయకుండా తటస్థంగా వ్యవహరించినా విప్ ధిక్కారమే అవుతుంది. మున్సిపల్ కౌన్సిలర్లు, మండల పరిషత్‌కు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీల విప్‌కు లోబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సిందేనని ఎన్నికల కమిషన్ తన నిబంధనల్లో పొందుపర్చింది. అలా చేయని సభ్యులపై నిబంధనల ప్రకారం విప్ దిక్కారం ద్వారా అనర్హుడుగా ప్రకటించే అవకాశముంది.

   

   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top