
రాష్ట్రాభివృద్ధిని మరువను: వెంకయ్య
ఉపరాష్ట్రపతి పదవికి తనను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత బీజేపీకి రాజీనామా చేయడానికి మనసు అంగీకరించలేదని వెంకయ్యనాయుడు చెప్పారు.
విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని భావించడం వల్లే రూ.2.36 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం నుంచి మంజూరు చేయించానని తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా ఎగువ సభ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేస్తానని వివరించారు. సభా సంప్రదాయాలు.. విలువలను కాపాడతానని, ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు తాను జంకుతున్నానని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారని, ఉప రాష్ట్రపతి పదవి ఏమీ తక్కువ కాదని, ఎన్నో బాధ్యతలు ఉంటాయని వెంకయ్య వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వెంకయ్య దేశానికి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తెస్తారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.