హత్యా రాజకీయాలకు భయపడేది లేదు 

There Is No Fear Of Murder Politics - Sakshi

సాక్షి, అనంతపురం సిటీ: నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యల్లో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడి హస్తముందని, ఆయనను తక్షణమే అరెస్టు చేసి సీబీసీఐడీతో విచారణ చేయించాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వైఎస్‌.వివేకానందరెడ్డి హత్యను నిరసిస్తూ శనివారం స్థానిక టవర్‌క్లాక్‌ వద్దనున్న గాంధీ విగ్రహం ముందు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నల్లచొక్కాలు, నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా ఆందోళన చేశారు. నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ‘జోహార్‌ వివేకానందరెడ్డి, జై జగన్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంఘటన జరిగిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకముందే చంద్రబాబునాయుడు పోలీసుల కన్నా ముందుగా స్పందించి ప్రకటనలు చేయడం చూస్తుంటే వివేకానందరెడ్డి హత్య వెనుక తెలుగుదేశం పార్టీ ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయన్నారు.

కనగానపల్లి మండలం ముత్తువకుంట్లలో తెలుగుదేశం పార్టీలోకి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంపీపీ భర్త ముకుందనాయుడు హెచ్చరించడం, అధికారం చేపట్టిన ఆరు నెలల్లో ఏమి చేసుకుంటారో చేసుకోండి, పోలీసులను నేను మేనేజ్‌ చేస్తానని వరదాపురం సూరి చెప్పడం చూస్తుంటే ఎన్నికల్లో గెలవాలన్న తపనతోనే టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్న చంద్రబాబునాయుడు ఇప్పటికైనా సక్రమ మార్గంలో నడవాలని హితవు పలికారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి నార్కో అనాలసిస్‌ పరీక్షలకు పంపినట్లయితే బండారం బయట పడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వైవీ.శివారెడ్డి, మీసాల రంగన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కెప్టెన్‌ షెక్షా, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీనాయుడు గొర్ల, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, కొండమ్మ, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, ఆదినారాయణరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మెనార్టీ నాయకులు సైఫుల్లాబేగ్, జమీర్, సాధిక్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top