రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వడగాడ్పులు వెంటాడనున్నాయి.
–కోస్తాలో కొనసాగుతున్న భగభగలు
–అక్కడక్కడ వర్షాలు
విశాఖపట్నం: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వడగాడ్పులు వెంటాడనున్నాయి. తీవ్ర సెగలతో జనాన్ని అల్లాడించనున్నాయి. రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాలు వేసవి తాపంతో అట్టుడికిపోయాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న తరుణంలో వాయవ్య దిశగా వేడిగా వీస్తున్న పొడిగాలుల ప్రభావంతోనే రాష్ట్ర్రంలో ఉష్ణతీవ్రతకు, వడగాడ్పులకు వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా బుధవారం బాపట్లలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది సాధారణంకంటే ఏడు డిగ్రీలు అధికం.
రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో పలు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లోనూ వడగాడ్పులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నివేదికలో వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతోకూడిన అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వివరించింది. గడచిన 24 గంటల్లో గోనెగండ్లలో 3, శాంతిపురంలో 2, గూడూరు, సి.బెనగల్, కంభం లలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదయింది.