నందికొట్కూరు: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కేఈ
నందికొట్కూరు: రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. బుధవారం పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. తంగడంచ ఫారం భూములల్లో ఫ్యాక్టరీలు నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. విద్యుత్ ఇబ్బందులు అధిగమించేందుకు జిల్లాకు సౌర వెలుగులు తీసుకొస్తామని హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్.. తుగ్లలక్ పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తుతే దౌర్జన్యంగా కృష్ణా జలాలను వాడుకోవాలని చూస్తున్నారన్నారు. రాయలసీమ రైతులంటే నలమల్ల పులి బిడ్డలని ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు.
తోపులాట..
ప్రజా సంఘాలు పెద్ద ఎతున్న తరలివచ్చి కేఈ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన సీఎం డౌన్, డౌన్ అంటు ప్రజా, విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. దీంతో పోలీసుల మధ్య, ప్రజా సంఘాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఉప ముఖ్యమంత్రికి ప్రజా, విద్యార్థి సంఘాలు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐజయ్య, కలెక్టర్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ గౌడు, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, పీపీ నాగిరెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ నరసింహులు, మార్కెట్ యార్డు సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.