తెల్లబోయే ఎర్ర నిజాలు

Sandlewood Smuggling in Chittoor Forest - Sakshi

కనుమరుగవుతున్న ఎర్రచందనం

ఆదాయం మీద శ్రద్ధ..రక్షణపై నిర్లక్ష్యం

వెంటాడుతున్న సిబ్బంది కొరత

దొంగలకు దీటుగా లేని     ఆయుధాలు

వాచర్లే కవచంగా అధికారుల భక్షణ

అడవులు స్మగ్లర్ల గొడ్డలి వేటుకు అంతరించి పోతున్నాయి. ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునే శేషాచలంలో అటవీ సంపద హరించుకుపోతోంది. స్వార్థపరుల వ్యాపార దాహానికి ఇక్కడి అరుదైన ఎర్రచందనం వృక్షాలు నేలకొరిగిపోతున్నాయి. దుర్భేద్యమైన అడవుల్లో స్మగ్లర్లు అమూల్య వనరులను కాజేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులను దాటిస్తున్నారు. వన సంపద దొంగల పాలవడమే కాకుండా పర్యావరణానికి కూడా పెనుముప్పు వాటిల్లుతోంది. రోజుకో వాహనం, పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నా.. దీనికి ఎక్కడా పుల్‌స్టాప్‌ పడడం లేదు.  

చిత్తూరు, భాకరాపేట: అమూల్యమైన సంపదను కాపాడాల్సిన అటవీ శాఖకు ఖాళీ పోస్టుల సమస్య సవాలు గా మారింది. ఎర్రచందనం వృక్షాలున్న  ప్రాంతా ల్లో సైతం పోస్టులు భర్తీ కావడం లేదు. తిరుపతి వన్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓ పరిధిలో చామల, బాలపల్లె అటవీ రేంజ్‌లు ఉన్నాయి. చిత్తూరు జిల్లా చామల, వైఎస్‌ఆర్‌ జిల్లా బాలపల్లె రేంజ్‌లో 28 బీట్లు ఉన్నాయి. ఇందులోని 18 బీట్లలో భారీ ఎత్తున ఎర్రచందనం ఉంది. ఈ ప్రాంతాల్లోనే ఎర్రదండు తరుచూ చొరబడుతోంది. ఇక్కడ సుమారు 50 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పనిచేయడానికి సిబ్బందెవరూ ముందుకు రావడంలేదు. దీంతో స్థానికంగా ఉం డే 90 మందిని ప్రొటెక్షన్‌ వాచర్లుగా తీసుకున్నా రు.  వీరి ఏంపికలో అధికారులు అవలంబిస్తున్నతీరుపై విమర్శలున్నాయి. వీరి నియామకం వెనుక ఎర్ర స్మగ్లర్లు, నాయకుల హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. 

పోలీసులకు పట్టుబడ్డ తరువాతే....
దొరికితే దొంగలన్న చందంగా ఎవరైనా అటవీ శాఖకు చెందిన వారు ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడ్డ తరువాతే ఆ శాఖ స్పందించి చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. చామలరేంజ్‌ పరిధిలో ఇటీవల ఎర్రావారిపాళెం మండలం నెరబైలు సెక్షన్‌లోనే ఆరుగురు  వాచర్లు పట్టుబడ్డారు.  వాహనాలను, దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రాబట్టి న సమాచారంతో ఎఫ్‌బీవో చొక్కలింగాన్ని సస్పెం డ్‌ చేశారు. భాకరాపేట ఫారెస్టు కార్యాలయంలోని గౌడన్ల నుంచి దుంగలు గోడపై నుంచి దాటవేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మదనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్‌ను వాచర్‌గా పెట్టుకుని అభాసుపాలయ్యారు. ఇలా పట్టుబడ్డాక చర్యలు తీసుకునే కంటే వారిపై ముందుగానే నిఘావేయాల్సి ఉంది.

అటవీ శాఖకు ఆయుధాలు కొరత..
ఆయుధాలు కొరత కూడా సమస్యగా తయారైనట్లు తెలిసింది. ఇద్దరు అధికారులు స్మగ్లర్ల చేతిలో హతమయ్యాక ఎర్రకూలీలను అడ్డు కోవాలంటే వారికి  అత్యాధునికి ఆయుధాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అమెరికా నుంచి 200 అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. ఇవి ఇక్కడకు చేరలేదు.  ఢిల్లీలోనే ఇవి తుప్పుబడుతున్నాయని తెలిసింది. ఎర్రచందనం అమ్మి భారీగా నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకున్న ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీకి రూ.29 లక్షలు చెల్లించనందుకు అవి విమానాశ్రయం దాటలేదని భోగట్టా.

కాగా అటవీశాఖలో జరిగే అవినీతికి యువ ప్రొటెక్షన్‌ వాచర్లను తమకు రక్షణ కవచంగా అటవీ అధికారులు మల్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఏదో ఒక ఉద్యోగం అనుకుని చేరి చివరికి  జైలు ఊసలు లెక్కపెడుతున్నారు చాలా మంది యువకులు.  అటవీ అధికారులే వారిని ఆ విధంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెరబైలు సెక్షన్‌లో పట్టుబడ్డ వాచర్లు తమ అధికారుల తీరును తప్పుబట్టినట్లు తెలిసింది.

పట్టించుకోని ప్రభుత్వం..
అటవీశాఖలో అవినీతిని ప్రభుత్వం ఏమాత్రం పట్టిం చుకోవడంలేదు. టెండర్ల ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించడంలో ఉన్న శ్రద్ధ ఎర్రచందనం కాపాడడంలో లేదు.  అమ్మకంలో వచ్చిన ఆదాయంలో 30 శాతం రక్షణకు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా ఆమేరకు నిధులు విడుదల కావడం లేదు.  రోజు పదుల సంఖ్యలో ఎర్ర కూలీలు పట్టుబడుతున్నారు. వీరి నుంచి సమాచారాన్ని రాబట్టి కోర్టుకు హాజరు పరిచేలోపు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందుకు ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోవడం కూడా అవినీతికి కారణంగా భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top