ఎర్ర చందనం వేలానికి లైన్ క్లియర్ | Redwood clear line auction | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం వేలానికి లైన్ క్లియర్

Oct 2 2014 2:31 AM | Updated on Aug 31 2018 8:26 PM

ఎర్ర చందనం వేలానికి లైన్ క్లియర్ - Sakshi

ఎర్ర చందనం వేలానికి లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ తలపెట్టిన ఎర్రచందనం వేలానికి లైన్ క్లియరైంది. ఎర్రచందనం వేలంపై స్టే విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు బుధవారం నిలుపుదల చేసింది.

ఎన్‌జీటీ ఉత్తర్వుల నిలుపుదల
బిడ్‌లను మాత్రం ఖరారు చేయవద్దని ఆదేశం
హైకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు
విచారణ 7కు వాయిదా

 
హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ తలపెట్టిన ఎర్రచందనం వేలానికి లైన్ క్లియరైంది. ఎర్రచందనం వేలంపై స్టే విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు బుధవారం నిలుపుదల చేసింది. ఎర్రచందనం వేలాన్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, అయితే బిడ్‌లను మాత్రం ఖరారు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ ఎం.సునీల్‌కుమార్ జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్ర చందనం వేలంపై స్టే విధిస్తూ గత నెల 17న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ గుండా చంద్రయ్య నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపించారు.

ఎర్రచందనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆస్తని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో సర్క్యులర్ల ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎర్రచందనం చెట్లని నరికి వేలం వేయడం లేదని, స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలనే వేలం వేస్తున్నామని కోర్టుకు నివేదించారు. అంతేకాక ఎర్రచందనం ఎగుమతులకు సైతం కేంద్రం అనుమతించిందని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉండగా... వీటన్నింటినీ పట్టించుకోకుండా ఏ మాత్రం సంబంధం లేదని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా వేలంపై స్టే విధిస్తూ హరిత ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, అసలు అటువంటి ఉత్తర్వులు జారీ చేసే పరిధి హరిత ట్రిబ్యునల్‌కు లేదని ఆయన వివరించారు. తరువాత కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) బి.నారాయణరెడ్డి వాదనలు వినిపిస్తూ... హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై అప్పీల్ అథారిటీగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తోందని, ఎన్‌జీటీ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... ఇప్పుడు ఈ వ్యవహారంలో జో క్యం చేసుకునే పరిధి హైకోర్టుకుందా..? లేదా? అన్న విషయం చెప్పాలని ఏజీని కోరింది. వేలం ప్రక్రియ ఏపీ ప్రభుత్వం చేపడుతోంది కాబట్టి, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే న్యాయపరిధి హైకోర్టుకుందని ఏజీ వేణుగోపాల్ చెప్పారు. దీంతో ధర్మాసనం, వేలం ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, ఎన్‌జీటీ ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి, ఎన్‌జీటీ రిజిస్ట్రార్ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 7కు వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement