‘పుష్కర’ను పూర్తి కా‘నీరు’! | Sakshi
Sakshi News home page

‘పుష్కర’ను పూర్తి కా‘నీరు’!

Published Mon, Feb 17 2014 1:48 AM

‘పుష్కర’ను పూర్తి కా‘నీరు’!

  • నిలిచిన పుష్కర ఎత్తిపోతల పథకం
  •  భూ సేకరణ వివాదంతో నిలిచిన నిర్మాణం
  •  పనుల రద్దుకు అధికారుల ప్రతిపాదనలు
  •  సాగునీటికి నోచని ఎనిమిది వేల ఎకరాలు
  •  గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయి. బీడు భూములు సస్యశ్యామలమవుతాయి. బతుకులు బంగారుబాటలో నడుస్తాయి... ఏడేళ్లుగా అన్నదాతలు కన్న కలలివి. పుష్కర ఎత్తిపోతల పథకంపై పెట్టుకున్న ఆశలివి. భూ సేకరణపై అభ్యంతరం తెలుపుతూ తూర్పు గోదావరి జిల్లా తుని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులకు గ్రహణం పట్టింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు భూ సేకరణ సమస్యనే సాకుగా చూపుతున్నారు. పనుల రద్దుకు ప్రతిపాదనలు పంపారు. రైతుల ఆశల్ని అడియాశలు చేశారు.
     
     పాయకరావుపేట, న్యూస్‌లైన్ : పుష్కర ఎత్తిపోత లపథకం ద్వారా గోదావరి జలాలు మెట్ట ప్రాంతాల్లో పరవళ్లు తొక్కుతాయని ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ మిగిలే పరిస్థితులు తలెత్తాయి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని, పాయకరావుపేట మండలాల్లోని 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులకు పచ్చజెండా ఊపారు.
     
     పుష్కర ప్రధాన కాలువ తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట నుంచి పిల్ల కాలువల ద్వారా తుని మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు, పాయకరావుపేట మండలం పాల్తేరు, కందిపూ డి, ఈదటం ముఠా ఆనకట్ట చానల్ ద్వారా పెదరామభద్రపురం, శ్రీరాంపురం, కుమారపురం, రాజవరం, కేశవరం గ్రామాల్లోని సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాలువ నిర్మాణం ప్రారంభించారు.
     
     పిల్ల కాలువలు, వాటిపై నిర్మాణాల కోసం రూ.2.92 కోట్లతో పనులు చేట్టారు. తుని మండలం వల్లూరు వద్ద ఎలైన్‌మెంట్ పనులు మార్చాలని, ఎస్.అన్నవరం వద్ద కాలువకు భూసేకరణ ఆపాలని రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో తుని పాయకరావుపేట నియోజక వర్గాల్లో 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు ఆగిపోయాయి.
     
     భూ సేకరణ సాకు
     భూసేకరణ విషయంలో రైతుల నుంచి ఎదురవుతున్న సమస్యలను నీటిపారుదల శాఖాధికారులు సాకుగా చూపుతున్నారు.
     
     తుని మండలంలో 1496 ఎకరాల ఆయకట్టు, పాయకరావుపేట మండలంలో ముఠా చానల్ ద్వారా సాగు నీరందించే పెదరామభద్రపురం, శ్రీరాంపురం, కుమారపురం, రాజవరం, కేశవరం గ్రామాల్లో 6694 ఎకరాల ఆయకట్టు పనుల రద్దుకు ప్రతిపాదనలను పుష్కర అధికారులు ప్రతిపాదనలు పంపారు.
     
     పాల్తేరు ప్రాంతంలో 497 ఎకరాలు, ఈదటం  ప్రాంతంలో 1699 ఎకరాలు, కందిపూడి ప్రాంతంలో 821 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు.
     
     ఈ పరిస్థితుల్లో పాల్తేరు, ఈదటం, కందిపూడి ప్రాంతాల్లో ఏడాదిన్నర క్రితం కాలువ పనులను నిలిపివేశారు. కొన్నేళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న తమ కలలు ఫలిస్తాయో లేదోన్న ఆతృత రైతుల్లో నెలకొంది.
     
     పుష్కర అధికారులు స్పందించి భూసేకరణ సమస్యను పరిష్కరించి ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కాలువ పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
     

Advertisement
 
Advertisement
 
Advertisement