చలానా చిక్కులు..రిజిస్ట్రేషన్‌కు చుక్కలు

Public Sufferd With CFMS Registrations In West Godavari - Sakshi

గుదిబండగా సీఎఫ్‌ఎంఎస్‌

బ్యాంకుల్లో చలానాలకు పాట్లు

రిజిస్ట్రేషన్లు ఆలస్యం కక్షిదారులకు అవస్థలు

నూతన విధానంపై అసహనం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌) ప్రజల నడ్డివిరుస్తోంది. ముఖ్యంగా ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల సందర్భంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకునే కక్షిదారులకు ఈ విధానం తలనొప్పిగా పరిణమించింది. రిజిస్ట్రేషన్‌కు సంబం ధించి వివిధ రకాల రుసుములన్నీ కలిపి ఒకే చలానాలో కట్టే పాత పద్ధతి స్థానంలో సీఎఫ్‌ఎంఎస్‌  విధానం అమలు కావడంతో ఒక రిజిస్ట్రేషన్‌కు ఐదు చలానాలను విడివిడిగా కట్టాల్సి వస్తోంది. దీంతో కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో ఒక్క రోజులో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికావడంతో మరుసటి రోజు రిజిస్టర్డ్‌ దస్తావేజులను కక్షిదారులు తీసుకువెళ్లేవారు. ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌  విధానంతో ఒక రోజంతా బ్యాంకుల్లో పడిగాపులు పడటంతో పాటు మరో రోజు రిజిస్ట్రేషన్‌ కోసం సమయం వెచ్చించాల్సి వస్తోంది. బ్యాంకుల్లో సర్వర్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం, రద్దీ వంటి సమస్యలతో చలానా చెల్లింపు ఆలస్యమవుతోంది.

దీంతో జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ఒక్క రోజులో రిజిస్ట్రేషన్‌ పని పూర్తి అయ్యేది. కొత్తగావచ్చిన సీఎఫ్‌ఎంఎస్‌ విధానంతో  చలానాలు కట్టడానికి ఒక రోజు బ్యాంకుల చుట్టూ తిరగడం, అది ముగిసిన తర్వాత మరుసటి రోజు రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ తిరగడం కక్షిదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. అవినీతిని నిర్మూలించేందుకు ప్రారంభించిన సీఎఫ్‌ఎంఎస్‌ విధానం ఆహ్వానించదగినదే అయినా కక్షిదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

గతంలో రిజిస్ట్రేషన్లు ఇలా..
జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖ పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను ఏలూరు, భీమవరం రిజిస్ట్రేషన్‌ జిల్లాలుగా విభజించారు. ఏలూరు జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, భీమవరం జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా ఆ శాఖ కక్షిదారులకు అందుబాటులో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. గతేడాది జిల్లాలో రిజి స్ట్రేషన్లు జరిగిన తీరును గమనిస్తే ఏలూరు జిల్లాలోని 12 కార్యాలయాల ద్వారా 74,054 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ జరిగింది. భీమవరం జిల్లా పరిధిలోని 15 రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా 70,822 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ లెక్కన నెలకు సుమారు 12 వేల దస్తావేజుల రిజి స్ట్రేషన్లు ఆయా కార్యాలయాల ద్వారా జరిగాయి. అయితే సీఎఫ్‌ఎంఎస్‌ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా త గ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నెలకు 8 వేల దస్తావేజులకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదని తెలుస్తోంది.

అందరికీ కొత్తే..
సీఎఫ్‌ఎంఎస్‌ విధానం రిజిస్ట్రేషన్‌ శాఖ సిబ్బందికి, అధికారులకూ కొత్తగానే ఉంది. కొత్త నిబంధనలు అమలు చేయాల్సి రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, సర్‌చార్జీ తదితర రుసుములన్నీ ఒకే చలానాగా బ్యాంకుల్లో జమచేసేవారు. ఇప్పుడు విడివిడిగా రుసుంను చలానా కట్టాల్సి వస్తోంది. మొదటి రోజు నెట్‌ సెంటర్‌లో చలానా నమోదు చేసుకోవడం తర్వాత ఆ పత్రాలను బ్యాంకులో చూపితే ఈ చలానా అందజేస్తున్నారు. ఇందులో ఒక కాలమ్‌ను ఖాళీగా ఉంచి 24 గంటల తర్వాత అంటే మరుసటి రోజు ఈ–చలానాను ఆమోదిస్తున్నారు.

ముప్పుతిప్పలు.. మూడు రోజులు
గతంలో నేరుగా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే అ న్ని రకాల ఫీజులు వసూలు చేసి ఒక్కరోజులో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసేవారు.  ఇప్పుడు సీఎఫ్‌ఎంఎస్‌ విధానంతో రిజిస్ట్రేషన్‌కు మూడు రోజుల సమయం పడుతోంది. మొబైల్‌లో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఉన్న వారు ఫోన్‌ నుంచే నేరుగా చలానా చెల్లించ వచ్చు. అయితే ఎక్కువ మంది ఈ విధానాన్ని వినియోగించుకోవడం లేదు.

ఆలస్యంపై ఫిర్యాదులు వస్తున్నాయి
సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో చలానాలు చెల్లించడానికి బ్యాంకులకు వెళుతుంటే అక్కడ చలానాలు చెల్లించడానికి ఆలస్యమవుతోందనే ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. దీనిపై సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చించి చలానా చెల్లింపులో జరిగే జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటాం. అలాగే నూతన విధానం కావడంతో మా సిబ్బందిలో కూడా కొంత గందరగోళ పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వారు ఈ విధానానికి అలవాటుపడుతున్నారు. ఇకపై త్వరగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది.                     – పి.విజయలక్ష్మి, ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top