అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎడాపెడా కోతల కారణంగా పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది.
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎడాపెడా కోతల కారణంగా పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. గ్రామాల్లోనూ సింగిల్ ఫేజ్ మోటార్లకు కోతలు విధిస్తుండడంతో మంచి నీటి కష్టాలు మొదలయ్యాయి. కోతలను భరించలేక సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు, రాస్తారోకోలకు దిగుతున్నారు. ములుగు, కర్కకపట్ల సబ్‌స్టేషన్‌లను రైతులు గురువారం ఏకకాలంలో ముట్టడించారు. ఇటీవల కౌడిపల్లి, హత్నూర సబ్‌స్టేషన్ల ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలో వారం రోజుల క్రితం పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ గ్రామసభ నిర్వహిస్తే రైతులు, గ్రామస్థులు ప్రధానంగా విద్యుత్ సమస్యనే ఏకరువు పెట్టారు.
ఇలా జిల్లాలో వారం, పదిరోజులుగా విద్యుత్ వెతలు తీవ్రమయ్యాయి. వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నా ఎక్కడా నాలుగైదు గంటలకు మించి సరఫరా కావడం లేదు. అదీ కూడా విడతల వారీగా ఇస్తుండడంతో రైతులు బేజారవుతున్నారు. దీనికి తోడు పట్టణాలు, పల్లెలకు సైతం ప్రస్తుతం అమలవుతున్న విద్యుత్ కోతలకు తోడు అదనంగా మూడు నుంచి నాలుగు గంటల పాటు సరఫరాను కట్ చేస్తున్నారు. దీంతో నీటి సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు రోజుకు 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ కాగా ప్రస్తుతం 14 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతుంది. రోజూ మూడు మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు కనిపిస్తోంది. ఈ లోటును పూడ్చేందుకు జిల్లా యంత్రాంగం అదనంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉందన్న నెపంతో ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచే నేరుగా 132 కేవీ సబ్‌స్టేషన్లకు రోజుకు 4 నుంచి 5 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. దీంతో జిల్లా వాసులకు అప్రకటిత విద్యుత్ కోతలు తప్పడం లేదు.
వ్యవసాయానికి నాలుగు గంటలేనా?
వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో చెబుతున్నా ప్రస్తుతం నాలుగు గంటల పాటే సరఫరా అవుతోంది. పగటిపూట 4, రాత్రి పూట 3 గంటలు సరఫరా చేయాల్సి ఉంది. అయితే రాత్రి వేళల్లో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కావడంలేదు. పగటిపూట కూడా విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. అప్రకటిత కోతల వల్ల బోరుబావుల కింద సాగుచేస్తున్న పంటలకు నీరందడం లేదు. ముఖ్యంగా వరి, చెరకు, కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 86 వేల హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. ఇందులో సుమారు 70 వేల హెక్టార్లు బోరుబావుల కింద సాగు చేసినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి పాలుపోసే దశలో ఉంది. ఈ సమయంలో వరికి నీళ్లు పెట్టకపోతే పంట ఎండిపోవడం, దిగుబడి తగ్గి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. మరికొన్ని రోజులపాటు విద్యుత్ కోతలు ఇలానే ఉంటే వరి రైతులు నష్టపోవటం ఖాయంగా కనిపిస్తోంది. చెరకు, కూరగాయల పంటలకు సైతం కోతల కారణంగా వాటికి రైతులు నీళ్లు పెట్టలేని పరిస్థితి ఉంది.
పల్లెల్లోనూ కరెంటు కరువు
పట్టణాలు, పల్లెల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో రెండు గంటలు, మున్సిపాలిటీలో మూడు గంటలు, మండల కేంద్రాల్లో నాలుగుగంటల పాటు విద్యుత్ కోతలు అధికారికంగా అమలవుతున్నాయి. విద్యుత్ లోటు కారణంగా మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో అదనంగా మరో మూడు నుంచి నాలుగు గంటలపాటు కోతలు విధిస్తున్నారు. పల్లెల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోతలను అమలు చేస్తున్నారు. అడపాదడపా రాత్రి వేళల్లో సైతం కోతలు తప్పడంలేదు. ఉదయం వేళల్లో గ్రామాల్లోని సింగిల్‌ఫేజ్ మోటార్లకు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తి ప్రజలు అవస్థలు పడాల్సివస్తోంది. అప్రకటిత కోతలను ట్రాన్స్‌కో అధికారులు ధ్రువీకరించడం లేదు.
లోటు వల్లే ఇబ్బందులు
జిల్లాకు రావాల్సినంతగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వ్యవసాయానికి సాధ్యమైన మేరకు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి రాత్రి వేళల్లో కోతలు విధించినా ఉదయం ఎక్కువ సమయం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నందున రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
- రాములు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, సంగారెడ్డి