అబలల ఆర్తనాదం ఇంతింత కాదయా..

Over 4.45 lakh phone calls in two years to Dial 181 - Sakshi

నమోదు చేసింది 2.47లక్షలు

వడపోతలతో 1,233 మంది బాధితులుగా గుర్తింపు

వాటిలో పరిష్కారానికి నోచుకున్నది సగమే

ఆపద, ఈవ్‌టీజింగ్, గృహహింస, వరకట్న వేధింపులు, బలవంతపు వ్యభిచారం వంటి ఫిర్యాదులపై చర్యలు శూన్యం

ఆదుకోవాలంటూ ‘డయల్‌ 181’కు రెండేళ్లలో 4.45 లక్షల ఫోన్‌కాల్స్‌ 

సాక్షి, అమరావతి: అనేక సమస్యలతో సతమతమవుతూ పరిష్కారం కోసం ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ ‘డయల్‌ 181’ను ఆశ్రయిస్తున్న మహిళలకు తీవ్రనిరాశే ఎదురవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలోని 13 శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ‘డయల్‌ 181’ అలంకారప్రాయంగా మారింది. ఆపద, ఈవ్‌టీజింగ్, గృహహింస, వరకట్నం, బలవంతపు వ్యభిచారం తదితర అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్న మహిళలు తమను ఆదుకోవాలంటూ లక్షలాదిగా చేస్తున్న ఫోన్‌కాల్స్‌పట్ల ఆయా శాఖలు స్పందించి పరిష్కరిస్తున్నవి అరకొరగానే ఉంటున్నాయి. హెల్ప్‌లైన్‌లో ద్వారా నమోదైన ఫోన్‌కాల్స్‌ వివరాలు చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. 

కాల్స్‌ కొండంత.. పరిష్కరించినవి గోరంత
2016 అక్టోబరు నుంచి 2018 ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,45,335 మంది మహిళలు సహాయం కోసం ఫోన్‌చేస్తే వాటిలో 3,22,077 కాల్స్‌ను మాత్రమే హెల్ప్‌లైన్‌ స్వీకరించింది. వాటిలో 2,47,954 కాల్స్‌ను నమోదు చేసుకోగా పరిగణలోకి తీసుకున్నవి కేవలం 1,233 మాత్రమే. వాటిలోనూ గడిచిన రెండేళ్లలో కేవలం 621మంది సమస్యలు మాత్రమే పరిష్కారానికి నోచుకోగా ఇంకా 612 పెండింగ్‌లోనే ఉంచారు. ఇలా ఫోన్‌కాల్స్‌ లిస్ట్‌ కొండంత ఉంటే నమోదు చేసి పరిష్కరించింది గోరంతగా ఉంది.

శాఖల మధ్య సమన్వయలేమి
వాస్తవానికి ‘డయల్‌ 181’ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్‌ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 13 శాఖలు పరిశీలించి తమ పరిధిలోకి వచ్చే సమస్యలను ఆయా శాఖలు పరిష్కరించాల్సి ఉంది. పోలీస్, సైబర్‌ క్రైమ్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ (ఐసీడీఎస్‌), చైల్డ్‌ ప్రొటెక్షన్‌ సర్వీస్‌ (ఐసీపీఎస్‌), డీఆర్‌డీఏ, హెల్త్, సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) తదితర ప్రభుత్వ శాఖలు బాధితులకు ఆపన్నహస్తం అందించాల్సి ఉంది. కానీ, నమోదవుతున్న ఫోన్‌కాల్స్‌కు, పరిగణలోకి తీసుకున్న వాటికి, పరిష్కరించిన వాటికి పొంతన లేకపోవడం చూస్తే శాఖల మధ్య సమన్వయంలేదనే విషయం స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. మహిళల నుంచి వస్తున్న ఫోన్స్‌ కాల్స్‌లో ఎక్కువగా రాజధాని ప్రాంతం నుంచే వస్తున్నట్లు నమోదైన కాల్స్‌ ద్వారా తెలుస్తోంది. రెండేళ్లలో అనేక వడబోతల అనంతరం నమోదైన 1,233 కేసులలో అత్యధికంగా గుంటూరు, కృష్ణా జిల్లాలోనే ఉండటం ఆందోళన కలిగించే విషయం. తూర్పుగోదావరి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top