ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏలూరు సిటీ : ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుల ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 9,375మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ సామగ్రిని తరలించేందుకు ఐదు ప్రత్యేక రూట్లను అధికారులు గుర్తించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాలకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా పోలింగ్ సామగ్రిని తరలించారు.
పోలింగ్‌కు 49 మంది ప్రిసైడింగ్ అధికారులు, 49 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 80 మంది ఇతర పోలింగ్ సిబ్బంది, ఆరుగురు జోనల్ అధికారులు, ఆరుగురు రూట్ అధికారులు, 49 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలింగ్ సరళిని ఆన్‌లైన్‌లో వెబ్‌కాస్టింగ్ చేసేందుకు 47 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను నియమించారు. జిల్లాలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సామగ్రి, సిబ్బంది తరలింపు కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు జగన్నాధం పరిశీలించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లు తమ హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు.
పటిష్ట బందోబస్తు
ఏలూరు (వన్ టౌన్) :జిల్లాలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు పటాలాన్ని బందోబస్తుకు సిద్ధం చేశారు. ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 18 మంది సీఐలు, 63 మంది ఎస్సైలు, 119 మంది ఎఎస్సై/హెడ్ కానిస్టేబుళ్లు, 356 కానిస్టేబుళ్లు, 100 మంది హోంగార్డులు, 38 మహిళా హోంగార్డులు, ఐదుగురు ఆర్‌ఎస్సైలు, 18 ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు, 120 ఏఆర్ కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు. రెండు ప్లాటూన్ల కేంద్ర బలగాలు కూడా బందోబస్తు నిర్వహణలో పాల్గొంటున్నాయి.