
వైద్య విద్యార్థి ఆత్మహత్య
ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది.
కళాశాల హాస్టల్ భవనం పైనుంచి దూకి బలవన్మరణం
ఏలూరు రూరల్: ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటు చేసుకుంది. నగరానికి సమీపంలోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న బలభద్రపు రితీష్(26) బుధవారం అర్ధరాత్రి కళాశాల ప్రాంగణంలోని హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజమండ్రికి చెందిన రితీష్ ఆశ్రమ్ కళాశాలలో హౌస్ సర్జన్ కోర్సు చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం కళాశాలలో జరిగిన స్పోర్ట్‌డే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న రితీష్ రాత్రి 7 గంటలనుంచి కనిపించకుండా పోయాడు.
విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. వారు కళాశాలలోని సీసీ కెమేరాలను పరిశీలించినా ఆచూకీ లభించలేదు. అర్ధరాత్రి 2 గంటల తరువాత కళాశాలలోని హాస్టల్ భవనం వెనక భాగం కింద రితీష్ శవమై పడి ఉండడాన్ని గుర్తించారు. రితీష్ హాస్టల్ గది మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తు రితీష్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అతని తల్లిదండ్రులు వెంకట్రాజు, సుజాత పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.