తెలుగుదేశం, బీజేపీల మధ్య ఎన్నికల అవగాహన దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిందని తెలిసి మదనపల్లె తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాలు..మదనపల్లె అసెంబ్లీ సీటు బీజేపీకి
- కేటాయిస్తారని సమాచారం
- రాజధానికి పయనమైన మదనపల్లె తెలుగు తమ్ముళ్లు
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం, బీజేపీల మధ్య ఎన్నికల అవగాహన దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిందని తెలిసి మదనపల్లె తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అధికారికంగా ఇంకా ప్రకటన రానప్పటికీ ఆ పార్టీల నాయకులు మాత్రం అంగీకరిస్తున్నారు. పొత్తులో భాగంగా తిరుపతి, రాజంపేట లోక్‌సభ స్థానాలతో పాటు మదనపల్లె అసెంబ్లీ స్థానం కూడా బీజేపీకి కేటాయించారని సమాచారం.
ఆ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి జి.భానుప్రకాష్‌రెడ్డి ఆదివారం సాయంత్రం తెలిపారు. దీంతో ఆ యా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోకి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట,గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు సైతం వస్తాయి. దీంతో తిరుపతి లోక్‌సభ స్థానం బీజేపీ టికెట్టు కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఆశావహులు పలువురు పోటీ పడుతున్నారు.
1999లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి తనయుడు గౌతమ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈయన కాకుండా నెల్లూరుకు చెందిన డాక్టర్ సునీల్‌తో పాటు అదే జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రామారావు పేరు వినిపిస్తోంది. వీరికి బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు ఆశీస్సులు ఉన్నట్టు తెలిసింది. కాగా రాజంపేట నుంచి ఎన్‌ఆర్‌ఐ చిన్నావాసుదేవరెడ్డి పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉంది.
ఈయన కిందటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున మదనపల్లె అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో ఉన్న సంబంధాలు ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేసేందుకు దోహదం చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఆ పార్టీ మహిళా నేత శాంతారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
మదనపల్లె అసెంబ్లీ స్థానం నుంచి కిసాన్‌మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి పేరు అధికారికంగా ప్రకటించడం లాంఛనమే. కాగా మదనపల్లె అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి చోటుచేసుకుంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సహా పలువురు ఆశావహులు ఇప్పటికే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీరంతా ఆదివారం రాత్రి రాజధానికి పయనమై వెళ్లారు. చంద్రబాబును కలిసి మదనపల్లెను బీజేపీకి కేటాయించడంపై నిరసన తెలుపనున్నట్టు సమాచారం.