చంద్రబాబు వల్లే ఈ దుస్థితి | Kodali Nani blames Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుబాబు వల్లే ఈ దుస్థితి

Aug 14 2013 1:16 AM | Updated on Sep 1 2017 9:49 PM

చంద్రబాబు వల్లే ఈ దుస్థితి

చంద్రబాబు వల్లే ఈ దుస్థితి

రాష్ట్రంలో ప్రస్తుతం దౌర్భాగ్యకరమైన పరిస్థితులు నెలకొనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నిర్ణయాలే ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నాని దుయ్యబట్టారు.

దుయ్యబట్టిన వైఎస్సార్‌సీపీ నేత కొడాలి నాని
చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి సీమాంధ్ర ప్రజల పక్షాన నిలవాలి
పూటకో మాటతో చంద్రబాబు ప్రజలను గందరగోళపరుస్తున్నారు
రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని బ్లాంక్‌చెక్ ఇచ్చింది బాబు కాదా?
నాలుగు లక్షల కోట్లు ఇవ్వండి మేం వెళ్లిపోతామన్నదీ చంద్రబాబు కాదా?
ప్లీనరీ నుంచి నేటి రాజీనామాల వరకూ మా పార్టీది ఒకే స్టాండ్
తండ్రిలా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే ఆలోచన మా వద్ద ఉంది
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం దౌర్భాగ్యకరమైన పరిస్థితులు నెలకొనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నిర్ణయాలే ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొడాలి నాని దుయ్యబట్టారు. చంద్రబాబు పూటకొక మాటతో ప్రజలను గందరగోళపరుస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజల మనోభావాల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు వెంటనే తన పదవులకు రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నుంచి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నిర్వహించిన అఖిలపక్షభేటీతో పాటు నేటి రాజీనామాల వరకూ ఒకే వైఖరి అవలంబించిందని నాని వివరించారు. ‘‘రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా ఒక తండ్రిలా అందరికీ సమన్యాయం చేయాలని కోరాం. చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని సూచించాం’’ అని గుర్తుచేశారు. చంద్రబాబు మాత్రం అధికార దాహంతో పూటకొక వైఖరి అవలంబించారని విమర్శించారు.

‘‘2004లో సమైక్యాంధ్ర అని చెప్పి ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచి విజయవంతంగా పాలన సాగించేసరికి బాబు తన వైఖరి మార్చుకున్నారు. వైఎస్‌ను దీటుగా ఎదుర్కోలేననే ఆలోచనతో 2008లో రాష్ట్ర విభజనకు అనుకూలమంటూ లేఖ రాశారు. ఆ తర్వాత 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని ఎన్నికల్లో పోటీచేశారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతని చెప్పారు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేసిన తర్వాత, అర్ధరాత్రి ప్రకటన అంటూ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించారు.

గతేడాది అక్టోబర్‌లో తాను చేపట్టిన పాదయాత్ర చేయడం కోసం మళ్లీ వైఖరి మార్చుకున్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేయండి.. మేం తెలంగాణకు అనుకూలమంటూ ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలంటూ ఒక బ్లాంక్‌చెక్ ఇచ్చేశారు. గత నెల 30వ తేదీన నిర్ణయం వెలువడిన తర్వాత 31న మధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెట్టి సీమాంధ్రకు కొత్తరాజధాని కోసం రూ.నాలుగు లక్షల కోట్లు ఇవ్వండి... ఇక్కడి నుంచి అన్నీ సర్దుకొని వెళ్లిపోతాం, మా పార్టీ రెండు చోట్ల ఉంటుందని చెప్పారు’’ అని గుర్తుచేశారు.

సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాతి రోజు చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలను టీవీ ఏర్పాటు చేసి నాని ప్రదర్శించారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు మళ్లీ యూ టర్న్ తీసుకొని ఆ పార్టీ నేతల చేత కొత్త డ్రామా చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా పూటకొక వైఖరి అవలంబిస్తున్న చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆయనకు చేతనైతే, ధైర్యం ఉంటే తమ పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు మాదిరిగా చంద్రబాబు కూడా ప్రధాన ప్రతిపక్ష పదవికి రాజీనామా చేసి ప్రజలతో కలిసి పోరాడాలని డిమాండ్ చేశారు.

బాబు ముందే ఎందుకు మాట్లాడలేదు?
రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబుకు ముందుగానే అన్ని రకాల సిగ్నల్స్ అందుతున్నా ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు. విభజనకు సంబంధించి నెల రోజులుగా మీడియాలో వెలువడుతున్న కథనాలపై కూడా ఏనాడూ స్పందించలేదని గుర్తుచేశారు. ప్రజల పక్షాన ఉన్న పార్టీగా వైఎస్సార్‌సీపీ గతకొంత కాలంగా కేంద్రాన్ని హెచ్చరించిన సందర్భాలను ఆయన వివరించారు.

‘‘సీమాంధ్ర ప్రాంతానికి సాగునీరు, రాజధాని తదితర విషయాల్లో అన్యాయం జరుగుతుందని తెలిసి పార్టీ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి షిండేకు లేఖ రాశారు. అయినా వారి వైఖరిలో మార్పు కనిపించకపోవడంతో గతనెల 25న పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి తీసుకోవాలని పార్టీ తరఫున కేంద్రానికి లేఖ రాశాం. అయినా వారి వైఖరిలో మార్పు లేకపోవడంతో పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈనెల 5న రాజీనామా చేశారు. అయినా పరిస్థితులు మారకపోగా, మరింతగా దిగజార్చడంతో పార్టీ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షురాలు పదవులకు రాజీనామా చేశారు’’ అని వివరించారు.

రాష్ట్రంలో వెన్నెముక లేని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు ఉండటంవల్లే ప్రజలకు ఈ దుస్థితి తలెత్తిందన్నారు. దివంగతులైన ఎన్‌టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండుంటే విభజన నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టేదని చెప్పారు. అసమర్థ నాయకులను చూసే తాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నోరుమూసుకొని పడుంటారనే ఆలోచనతో కేంద్రం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని నాని మండిపడ్డారు.
 

కాపీ కొట్టడం బాబు నైజం!
రాష్ట్ర విభజనకు సంబంధించి వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతున్న విషయాలను చంద్రబాబు వల్లె వేస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలోని అంశాలనే బాబు కాపీ చేసి మాట్లాడుతున్నారని చెప్పారు. సాగునీరు, ఉద్యోగాలు, రాజధాని అంశాలపై తాము లేవనెత్తిన వాటినే ప్రస్తావిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు కాపీ కొట్టడం కొతేమీ కాదన్నారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు.

‘‘హైదరాబాద్‌కు మెట్రోరైలు తీసుకొచ్చింది తానే అంటారు. సంవత్సరం క్రితం వచ్చిన మెట్రోరైలు తన వల్లే వచ్చిందంటారు. అంతర్జాతీయ విమానాశ్రయం తానే తెచ్చానంటారు. విమానాశ్రయానికి శంకుస్థాపన గానీ ప్రారంభోత్సవం చేసిన దాఖలాలు గానీ లేవు. ఇంకా విచిత్రమేమిటంటే రింగురోడ్డు కూడా తనవల్లే అంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఎవర్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు?  ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు. రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌తో పాటు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేశారు’’ అని చెప్పారు.

2008లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు అదే పార్టీలో ఉన్నారు కదా అని మీడియా ప్రశ్నించగా... ‘‘అప్పుడు నాతోపాటు కొందరు నేతలు.. ముఖ్యంగా ఎర్రన్నాయుడు వద్దని వారించారు. అయితే తెలంగాణ వచ్చేది కాదు, పోయేది కాదంటూ చంద్రబాబు సర్దిచెప్పారు’’ అని తెలిపారు. ఒక తండ్రిలా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే ఆలోచన తమ పార్టీ వద్ద ఉందని, కేంద్రం అడిగితే తప్పకుండా సలహా ఇస్తామని మరో ప్రశ్నకు బదులుగా నాని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement