ఆశల బతుకులు..కిడ్నీ రోగుల కడగండ్లు

మూత్రపిండం మార్పిడికి వ్యయప్రయాసలు

విశాఖలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చు

రిమ్స్‌లో కానరాని కిడ్నీ వైద్యవిభాగాలు

డయాలసిస్‌ సెంటర్లకే సర్కారు పరిమితం

శాశ్వత పరిష్కారం దిశగా కానరాని చర్యలు

అవయవ దాతలున్నా నిబంధనలు కఠినం

జీవన్‌దాన్‌ యూనిట్‌పై నోరు మెదపని వైనం  

మర్రిపాటి తులసీదాస్‌... కవిటి మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన ఈయన మూడేళ్ల కిందటి వరకూ విశాఖ జిల్లా పరవాడలోని ఎన్‌టీపీసీ వద్ద ఓ హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ విధి మరోలా తలచింది. 2014లో అతనికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిది నెల ల నుంచి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకోవడం తప్పనిసరి. ఇతనికి భార్య ఆదిలక్ష్మితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అఖిల 7వ తరగతి, రేష్మ 4వ తరగతి, విన్ని రెండో తరగతి చదువుతున్నారు.

కళియా లక్ష్మణరావు... కంచిలికి చెందిన ఈయనకు మూడు పదుల వయస్సులోనే కిడ్నీ పాడైపోయింది. అసలే పేద కుటుంబం. మందులు కొనుక్కోవడానికి కూడా ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. నెలకు రూ.10 వేలు ఖర్చు భరించలేక హోమియోపతి మందులను ఆశ్రయించారు.  

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: తులసీదాస్, లక్ష్మణరావు వంటి వారు ఉద్దానంలో వేలాది మంది ఉన్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశ పడుతున్న వారు, ఎలాగైనా జబ్బు తగ్గిపోవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్న వారు దాదాపు ప్రతి వీధిలోనూ కనిపిస్తారు. కానీ వీరి ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదు. వీరి కన్నీరు సర్కారు పెద్దలకు కనిపించడం లేదు. కిడ్నీ రోగులకు రూ.2,500 పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి, ఆరో గ్యశాఖ మంత్రి ఘనంగా ప్రకటించినా అదీ నామమాత్రమే అయ్యింది. ఎన్‌టీఆర్‌ ఆరోగ్యసేవ కింద ప్రతి నెల డయాలసిస్‌ చేయించుకుంటేనే ఆ డబ్బు అందుతుంది. అంటే డయాలసిస్‌ ఆపేస్తే పింఛను కూడా ఆగిపోతుం ది. ప్రభుత్వం స్పందించి తమకేదో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని కోటి ఆశలతో ఉన్న ఉద్దానం వాసుల కడగండ్లు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేవలం సమావేశాలు, హామీల ప్రకటనలకే పరిమితమవుతున్నారు.

ఏదీ భరోసా?
జిల్లాలో కిడ్నీ రోగులకు సరైన వైద్యం అందించి, అవసరమైతే కిడ్నీ మార్పిడి చేయించి దీర్ఘాయుష్షుకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు ఉండట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు మూడేళ్లకు మించి జీవితకాలాన్ని పెంచలేని డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంది. అభివృద్ధిలో వెనుకబడిన సిక్కోలు జిల్లా ప్రజల ఆరోగ్యానికి వరప్రదాయినిలా ఉండాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్థానిక నాయకుడు ధర్మాన ప్రసాదరావు చొరవతో శ్రీకాకుళంలో ఏర్పాటు చేయించిన రాజీవ్‌గాంధీ బోధనాసుపత్రి (రిమ్స్‌)ని సద్వినియోగం చేసుకొనే విషయాన్నే నేటి ప్రభుత్వం విస్మరిస్తుందనే భావన బాధితుల్లో కలుగుతోంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి కారణాలను అన్వేషించేలా పరిశోధన విభాగంతో పాటు అవయవదాతల నుంచి సేకరించిన కిడ్నీలను రోగులకు అమర్చేలా ఒక ప్రత్యేక శస్త్రచికిత్స విభాగాన్నీ రిమ్స్‌లోనే ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అవయవ దానానికి పలువురు ముందుకొస్తున్న దృష్ట్యా రిమ్స్‌లో జీవన్‌దాన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదననూ ప్రభుత్వం పక్కనపెట్టేయడం గమనార్హం.

కిడ్నీ మార్పిడి కనాకష్టం
ఉద్దానంలోని కిడ్నీ బాధితుల్లో 90 శాతం మంది వారానికి రెండు రోజులు డయాలసిస్‌ కోసం విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్తున్నారు. అక్కడ కిడ్నీ మార్పిడికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కానీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు 2015 సంవత్సరంలో ఐదు, గత ఏడాది రెండు మాత్రమే జరిగాయి. అదే విశాఖలోనే ఉన్న కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం నెలకు పది నుంచి 20 వరకూ జరుగుతుండటం గమనార్హం. ఆయా ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకోవడానికే ఆర్థిక స్థోమత సరిపోని ఉద్దానం పేదలకు ఇక కిడ్నీ మార్పిడి అంటే తలకు మించిన భారమవుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఆరోగ్య శ్రీ కింద రూ.1.90 లక్షల వరకే సహాయం అందుతోంది. తర్వాత ఆర్నెళ్లకు రూ.80 వేల చొప్పున ఏడాది కాలానికి మందులకు ఇస్తున్నారు. కానీ శస్త్రచికిత్స తర్వాత రూ.80 వేల నుంచి రూ.లక్ష ఖరీదు ఉండే ఇంజెక్షన్లు కనీసం రెండు తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత నెలకు రూ.2 వేలు మందులకు ఖర్చువుతోంది. అన్ని ఖర్చులు కలిపి రూ.5 లక్షల వరకూ చేతి నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి.

నిబంధనలతో ఇబ్బందులు
ఒకవేళ ఎవరైనా దాతలు కిడ్నీ దానానికి ముందుకొచ్చినా శస్త్రచికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఇలా చేయించుకోవాలంటే ముందుగా బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ అనుమతి పత్రం ఇవ్వాలి. ఇది కేజీహెచ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలో రిమ్స్‌ బోధనాసుపత్రి అయినప్పటికీ ఆ సౌకర్యం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా కేజీహెచ్‌ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. అంతేకాదు దాత, గ్రహీత ఇద్దరూ పోలీసు, రెవెన్యూ శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలను కూడా బోధనాస్పత్రి కమిటీకి సమర్పించాల్సి ఉంది. మళ్లీ ఆ పత్రాలను కమిటీ తిరిగి పోలీసు, రెవెన్యూ అధికారులకు పంపించి పునఃపరిశీలన చేయిస్తుంది. ఇందంతా జరిగేటప్పటికీ పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది.

‘రిమ్స్‌’ను విస్మరిస్తున్నారే...
జిల్లాలో కిడ్నీ వ్యాధుల తీవ్రత దృష్ట్యా కనీసం నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను సూపర్‌ స్పెషాలిటీ సౌకర్యాలతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి సాకారమైతే రిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీ సర్జన్లు, క్లినికల్‌ ల్యాబ్, ప్రత్యేక వార్డు, ప్రత్యేక శస్త్రచికిత్స విభాగం అందుబాటులోకి వస్తాయి. వీటన్నింటి కల్పనకు రూ.2 కోట్లకు మించి వ్యయం కాదని వైద్యనిపుణులే చెబుతున్నారు. శ్రీకాకుళం రిమ్స్‌ బోధనాసుపత్రి అయినప్పటికీ ఇప్పటివరకూ నెఫ్రాలజీ విభాగానికి నోచుకోలేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని సూపర్‌ స్పెషాలిటీ స్థాయికి తీసుకొస్తే తప్ప ఉద్దానం కిడ్నీ రోగులకు జిల్లాలో తగిన వైద్యం అందే పరిస్థితి ఉండదు. రిమ్స్‌లో ఆరు సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లినా బుట్టదాఖలే అయ్యాయి.

అంతేకాదు రాష్ట్రంలో శ్రీకాకుళం రిమ్స్‌ తప్ప మిగతా జిల్లాల్లోని ప్రభుత్వ బోధనాస్పత్రులన్నింటిలోనూ జీవన్‌దాన్‌ యూనిట్‌ ఉంది. దీనిద్వారా కిడ్నీలు, ఇతర అవయవాల మార్పిడి ప్రక్రియ సులభమవుతోంది. శరీరం, అవయవ దానాలకు ముందుకొచ్చే దాతల పేర్లను నమోదు చేసుకొని, వారి మరణానంతరం ఆయా అవయవాలను సేకరించి అవసరమైన వారికి సమకూర్చడంలో ఈ యూనిట్‌ సహకరిస్తోంది. మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో మృతులు లేదా బ్రెయిన్‌ డెడ్‌ అయినవారి నుంచి కిడ్నీలు సేకరించి రోగులకు మార్పిడి చేసే ప్రక్రియ జిల్లాలో అందుబాటులోకి వస్తుంది. కానీ ఇవన్నీ విస్మరించి ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమవుతోంది.

 కిడ్నీ మార్పిడికి అవకాశం ఉంటే...
ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కింద కిడ్నీ మార్పిడికి అవకాశం లేకపోవడం వల్లే నేను భర్తను కోల్పోయాను. పేదరికం వల్ల అతనికి కిడ్నీ మార్పిడి చేయించలేకపోయాం. ఆ ఒక్క అవకాశం ఉంటే నా కిడ్నీ ఇచ్చి బతికించుకునేదాన్ని. – లొట్టి తేజావతి, రాజపురం, కవిటి మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top