
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 9 నుంచి 17వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే విషయంలో ఆగమ సలహా మండలి అభిప్రాయం ఏమిటో తెలుసుకుని చెప్పాలని హైకోర్టు మంగళవారం టీటీడీ అధికారులను ఆదేశించింది. టీవీల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు శాస్త్రాలు అనుమతిస్తాయో లేదో తెలపాలంది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మహా సంప్రోక్షణ కార్యక్రమానికి భక్తులను అనుమతించేది లేదని టీటీడీ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆ కార్యక్రమా న్ని టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరు అరండల్‌పేటకు చెందిన బి.అనిల్‌కుమార్, గుజరాత్‌కు చెందిన భుపేందర్ కె.గోస్వామి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.