వసతి..వ్యథే..! | Government Hostels Minimum Facilities In Nellore | Sakshi
Sakshi News home page

వసతి..వ్యథే..!

Published Mon, Aug 27 2018 10:49 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

Government Hostels Minimum Facilities In Nellore - Sakshi

సంక్షేమ హాస్టలే తమ ఇల్లని సంబరపడ్డారు. అధికారులే తమ సంరక్షకులని భావించారు. హాస్టల్‌ అధికారులే పెద్ద దిక్కని భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. తిండి సరిగా లేదు. ఫ్యాన్‌ ఉన్నా తిరగడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా నీటి జాడ లేదు. ఆరుబయట స్నానాలు, అరకొర అద్దె భవనాలు, మెనూ పాటించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు సంక్షామానికి గురయ్యాయి. దీంతో  విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. హాస్టళ్ల సమస్యలపై సాక్షి ప్రత్యేక కథనం.

నెల్లూరు రూరల్‌: పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్‌రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్న వాటికి కన్నాలు పడ్డాయి.

మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.

ఇందులో 22 బీసంక్షేమ హాస్టళ్లు చాలీచాలని వసతులతో అద్దె భవనాల్లో కాలం వెల్లదీస్తున్నారు. వసతుల కల్పనలో విఫలం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వంతోపాటు అధికారులు విఫలమయ్యారు. చాలీచాలని గదుల్లో విద్యార్థులు తమ పెట్టెలు, వస్తువుల వద్దే నిద్రిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువుకోవడానికి సరైన వసతులు లేక తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది. కొన్ని కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలు గదుల్లోకి చేరుతున్నాయి. కొన్ని గదుల్లో ఫ్యాన్‌లు ఉన్నా తిరగకపోవడంతో దోమల దాటికి విద్యార్థులకు సరిగా నిద్రపట్టడం లేదు. దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చలిలో జాగారం చేస్తున్నారు.

ఇనుపపెట్టెలను 2008వ సంవత్సరంలో అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. ఉన్నవి విరిగిపోయి వంగిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. వాటిలో దుస్తులు కానీ, పుస్తకాలు కానీ దాచుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారు పాత పెట్టెలలోనే వస్తువులు భద్రపరచుకుంటూ కాలం వెళ్లతీస్తున్నారు. వసతి గృహాల్లో ఎలుకలు వాటిని చిందర వందర చేస్తున్నాయి. ఎలుకల వల్ల కొన్ని వసతి గృహాల్లో కంటి మీద కునుకు లేకుండాపోతోంది.
 
భద్రత కరువు 
బాలికల వసతి గృహాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ కరువైంది. వాచ్‌మన్‌లను ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంతో పలు హాస్టళ్లలో రాత్రి వేళ్లల్లో ఆగంతకులు, ఆకతాయిలు, మందుబాబులు చొరబడినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బాలికల హాస్టళ్లలో పురుషులను సిబ్బంది, ట్యూటర్లుగా నియమించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ సిబ్బంది సరిపోవడం లేదంటూ పలు హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై అగాయిత్యాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఇలా అయితే మోనూ ఎలా..
వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మెస్‌ చార్జీలను పెంచింది. ఇందులో భాగంగా హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన చార్జీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తోపాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్‌ హోంలు, ఆనంద నిలయాలకు వర్తింపచేశారు. పెంచిన మెస్‌ చార్జీలు జూలై 1వ తేదీ నుంచి కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండుసార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ వడ్డించాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అందులో స్కేల్‌ ఆఫ్‌ రేషన్‌ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేం చేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు ఇప్పుడు మెస్‌ చార్జీల పెంపునకు చాలా తేడా ఉంది. ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా  భరించాల్సి వస్తుందని వార్డెన్లు వాపోతున్నారు. ఈ మెనూ అమలు సాధ్యం కాదని అధికారులు, వార్డెన్లు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు.
 
తప్పని ఎక్కిళ్లు..
హాస్టళ్లకు దాతలు ఇచ్చిన ఆర్వోప్లాంట్‌లు మరమ్మతులకు గురికావడంతో మూలనపడ్డాయి. విద్యార్థులకు గ్లాసుల పంపిణీ లేదు. భోజనం చేసే సమయంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో చేతిపంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని ప్లేట్లు పగుళ్లిచ్చాయి.
 
ఆరుబయటకే..
హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో బయటకు వెళితే విషపురుగుల బారిన పడుతామేమోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. హాస్టల్‌ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పందులు తిరుగుతున్నాయి.

దీంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ అంటూ బహిరంగ మలవిసర్జన వద్దని, పారిశుద్ధ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటనలు చేయడం తప్ప సంక్షేమ హాస్టళ్లలో సరిపడిన మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతుల లేమి కారణంగా హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇప్పటికే జిల్లాలో 80 హాస్టళ్లు మూతపడ్డాయి. 

మౌలిక వసతుల కల్పనకు చర్యలు 
జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. పెట్టెలు, దుప్పట్లు అందజేశాం. మరుగుదొడ్ల నిర్మాణం, పాత భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తాం. ప్రతి హాస్టల్‌కు వాచ్‌మన్‌ నియమించడంతోపాటు, బాలికల వసతిగృహాలకు భద్రత పెంచాం. పెరిగిన మెస్‌ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన మెనూలో కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ పూర్తిస్థాయిలో మెనూ అమలు చేయాలని వార్డెన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. – డి.మధుసూదనరావు, ఉప సంచాలకులు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

నెల్లూరు : ముద్దగా ఉన్న అన్నం , నీళ్ల సాంబారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement