ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కష్టమే | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కష్టమే

Published Sat, Aug 31 2013 2:07 AM

government employees getting salaries is doubtfull

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల జీతాలు ఆగిపోనున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో ఖజానా శాఖ కార్యకలాపాలు స్తంభించాయి. ఫలితంగా ఈనెల జీతాలు బిల్లులు మంజూరు కాలేదు. జిల్లా ఖజానా నుంచి ప్రతినెలా సుమారు రూ.100 కోట్ల మేర చెల్లింపులు జరుగుతాయి. ఉద్యోగుల జీతాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులన్నీ ఖజానా శాఖ ద్వారా ఆయా శాఖలకు అందుతాయి. అందులో ఉద్యోగుల జీతాల బిల్లులే సుమారు రూ.75 కోట్లు ఉంటాయి. ఏలూరులోని జిల్లా ఖజానా శాఖ ప్రధాన కార్యాలయం, కొవ్వూరు, నర్సాపురంలోని డివిజన్ కార్యాలయూలతోపాటు మరో 12 చోట్ల సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే 160 మంది ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. జిల్లా ఖజానా శాఖాధికారి మాత్రమే విధుల్లో ఉండటంతో బిల్లులన్నీ ఆగిపోయాయి.
 
దీంతో జిల్లాలోని 45,155 మంది ఉద్యోగులకు ఈ నెల జీతాలు అందే పరిస్థితి లేకుండాపోయింది. ప్రభుత్వ శాఖల్లో 26,370 మంది ఎన్జీవోలు, ప్రభుత్వ పాఠశాలల్లో 13,785 మంది ఉపాధ్యాయులు, మూడు వేలమంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరందరికీ జీతాలు ఆగిపోన్నాయి. విధుల్లో ఉన్న పోలీసు, ఫైర్ ఉద్యోగులకు ఎలాగోలా జీతాలిచ్చేందుకు ఖజానా శాఖ ప్రయత్నాలు చేస్తోంది. వారికి సంబంధించిన జీతాల బిల్లులన్నీ క్లియర్ చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు తెలిసింది. దీంతో సాధ్యమైనంత వరకూ జిల్లా నుంచే వారి జీతాల బిల్లులను క్లియర్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement