అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఫలితంగా పదిహేను రోజులుగా అంగన్‌వాడీలు ఆందోళన బాట వీడడం లేదు.
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఫలితంగా పదిహేను రోజులుగా అంగన్‌వాడీలు ఆందోళన బాట వీడడం లేదు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా నివారణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో జిల్లాలో పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు సమయానికి పౌష్టికాహారం అందకపోవడంతో సతమతం అవుతున్నారు. డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెలో ఉంటామని అంగన్‌వాడీలు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 3,291 మంది అంగన్‌వాడీలు, 3080 ఆయాలు, 352 మంది మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11 నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. 17 నుంచి సమ్మె బాట పట్టారు. జిల్లాలో సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాలకు చెందిన కార్యకర్తలున్నారు.
సీఐటీయూ సంఘాలకు చెందిన అంగన్‌వాడీలు సమ్మెలో ఉండగా ఏఐటీయూసీ కి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వర్తిసున్నారు. దీంతో జిల్లాలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా మిగతావి మూతపడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం, ఆటపాటలు, మధ్యాహ్న భోజనం వండి పెడతారు. బాలింతలు, గర్భిణులుకు అమృతహస్తం పథకం కింద భోజనం వడ్డిస్తారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడడంతో ఇవేవీ అమలుకావడం లేదు.
శ్రమ దోపిడీ
ఓటరు నమోదు, సర్వేలు, పల్స్ పోలియో, ప్రభుత్వ పథకాలపై ప్రచారం ఇలా అన్ని పనులు చేస్తున్నా కనీస వేతనం అందడం లేదని అంగన్‌వాడీల ఆవేదన. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పని చేస్తున్నా నెలకు రూ.3,700 చెల్లిస్తూ ప్రభుత్వం శ్రమదోపిడీకి పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని గంటలు పెంచినా వేతనాలు పెంచడం లేదని, అద్దె భవనాల అద్దె పెంచినా షరతులు విధిస్తున్నారని అంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరితే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.