
భూ సమీకరణపై రైతుల్లో పునరాలోచన
రాజధాని గ్రామాల్లో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరిపిన పర్యటన ఆ ప్రాంత రైతులను చైతన్యవంతులను చేసింది.
రాజధాని గ్రామాల్లో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జరిపిన పర్యటన ఆ ప్రాంత రైతులను చైతన్యవంతులను చేసింది. తమ భూములు ఎక్కడికిపోవనే భరోసానిచ్చింది. తాను అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామన్న జగన్ మాటలు వారిలో కొండంత ధైర్యాన్ని పాదుకొల్పాయి. రైతుల కోసం ఎందాకైనా పోరడతానని జగన్ పునరుద్ఘాటించడం ప్రజల్లో ఆయనపై ఉన్న ప్రేమానురాగాలను రెట్టింపు చేసింది. తమకోసం పోరాడే యోధుడు ఉన్నాడనే విశ్వాసాన్ని తమ గుండెల నిండా నింపుకొనేలా చేసింది. ఏ ఆపద వచ్చినా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందనే నమ్మకాన్నీ పెంచింది.
మంగళగిరి
రాజధాని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో రైతులు పునరాలోచ నలో పడ్డారు. భూసేకరణ అస్త్రంతో రైతులను భయభ్రాంతులకు గురి చేసి సమీకరణ పూర్తి చేసిన ప్రభుత్వ పెద్దలకు వెన్నులో వణుకు ఆరంభమైంది. ముందు ముందు రైతుల భూముల జోలికి వెళ్లలేమనే భయం కలిగింది. మంగళవారం ఉండవల్లి గ్రామం నుంచి ప్రారంభమైన జగన్ పర్యటనకు రైతులు, మహిళలు, యువకులు భారీగా వెంట వచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఆరు గ్రామాలలో పర్యటించేసరికి పొద్దుపోవడం, మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పర్యటన ముగించాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో మిగిలిన ప్రాంతాలకు జగన్ వెళ్లలేకపోయారు.
జగన్ స్వయంగా పొలాల్లోకి వెళ్లి రైతులు, కూలీలతో నేరుగా మాట్లాడి వారి బాధలను విన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అండతో కోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పడం రైతులకు ఆనందాన్ని కలిగించింది. దీంతో కొందరు రైతులు ప్రభుత్వంతో అగ్రిమెంట్‌కు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు భూసేకరణ జరిగిన నవులూరు, బేతపూడి, ఎర్రబాలెం, నిడమర్రు గ్రామాలలోని రైతులు ప్రభుత్వం భూ సేకరణ చేస్తుందని భయపడే సమీకరణకు భూములు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి వారంతా రానున్న రోజుల్లో ప్రభుత్వంతో జరిగే అగ్రిమెంట్‌కు వెనక్కి తగ్గే ఆలోచన లో వున్నట్లు చెబుతున్నారు. సమీకరణ గడువు ముగుస్తున్న చివరి రెండు రోజులలో టీడీపీ నేతలతో పాటు అధికారులు రకరకాల ప్రచారాలు చేసి రైతులను భయాందోళనకు గురి చేశారు. సమీకరణకు భూములు ఇవ్వని రైతులకు అమ్ముకునే అవకాశం లేదని ప్రచారం చేశారు. దీంతో ఎక్కువ మంది రైతులు అంగీకార పత్రాలను అందజేశారు.
ప్రస్తుతం వీరంతా పునరాలోచనలో పడ్డారు. తమ భూములు ఎక్కడికిపోవనే నమ్మకం కలిగిందనీ, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేది లేదని తేల్చి చెపుతున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలతో పాటు ఎర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు గ్రామాల్లో జగన్‌రాక కోసం మహిళలు, రైతులు బారులుతీరి ఎదురుచూడడం ఈ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దంపట్టింది. జగన్ పర్యటన విజయవంతం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కృషి వుందనడంలో ఎలాంటి సందేహం లేదు.