కరువు మేఘం | Sakshi
Sakshi News home page

కరువు మేఘం

Published Sat, Aug 8 2015 1:37 AM

కరువు మేఘం - Sakshi

జిల్లాలో కరువు కమ్ముకొస్తోంది.. సాగు భూములు బోసిపోతున్నాయి.. ఖరీఫ్ మొదలై రెండు నెలలు కావస్తున్నా వర్షం జాడ లేదు. ఆకాశంకేసి చూడడం తప్ప అన్నదాతకు పాలుపోవడం లేదు. మరోవైపు వ్యవసాయ కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. పనుల్లేక పట్టణాల బాట పడుతున్నారు. దారి చూపాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతోంది.  ఈ ఏడాది సాగు సంకటంగా మారింది.
 
సాక్షి ప్రతినిధి, గుంటూరు:
జిల్లాలోని 30 మండలాల్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. పల్నాడులోని రైతులు, సామాన్య ప్రజలపై వర్షాభావ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జూలైలో 142.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే 112.1 మి.మీ తక్కువగా వర్షపాతం నమోదైంది. వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో పత్తి సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఇక్కడ 1.20 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంటే 30 వేల హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. నెల గడిచినా పదునైన వర్షం కురవక పోవడంతో మొలకెత్తిన మొక్కల్లో పెరుగుదల లేక గిడసబారిపోతున్నాయి.  మొక్కలను  రక్షించుకునేందుకు ట్రాక్టర్ల సహాయంతో దూరప్రాంతాల నుంచి సాగునీటిని రవాణా చేస్తున్నారు. కొందరు రైతులు విత్తని విత్తనాలను తిరిగి షాపుల్లో అమ్ముకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండునెలలు గడిచినా సాగు నీరు లేక భూములు బోసిగా కనిపిస్తున్నాయి.
 
పనుల్లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులు
ఓ వైపు వర్షాభావం.. మరోవైపు సాగర్ కుడి కాలువ నుంచి నీరు విడుదల కాకపోవటంతో పంట పొలాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో పంట పొలాలపై ఆధారపడే కూలీలు పనులు కూడా దొరకక అల్లాడిపోతున్నారు. మాచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు లాంటి మండలాల్లోని వ్యవసాయ కార్మికులు పనుల కోసం ఎగబడుగున్నారు.

ఒకో మండలం నుంచి వెయ్యి నుంచి 1,500 వరకు ఉపాధి కూలీ పనుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. నీటి ఎద్దడి వలన పశువులను నీరున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. సాగర్‌నీరు లేక, సకాలంలో వ ర్షాలు పడక రైతులకు మళ్లీ గడ్డుకాలం వచ్చినట్లు కనిపిస్తుంది. ఈనెలలో మిరప నాట్లు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికీ రైతులు వేసి చూసే దోరణిలో ఉన్నారు. దీనికి తోడు భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో బోర్ల కింద సాగు చేసిన పత్తి పంట కూడా ఎండిపోతుంది. దీంతో ఈ ఏడాది రైతులు కరువుతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
 
డెల్టాలో పెరుగుతున్న ఖర్చులు..
డెల్టాలో వరి పంటను సాగు చేస్తున్న రైతులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. 4.18 లక్షల ఎకరాల్లో వరి సాధారణ విస్తీర్ణం ఉంటే ఇప్పటివరకు 1.20 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. కొందరు రైతులు బోర్ల సహాయంతో నారుమడులు పోస్తే, మిగిలిన రైతులు విత్తనం ఎదజల్లే విధానం ద్వారా వరిని సాగు చేస్తున్నారు. వర్షాలు కురవకపోవడంతో నాటిన వరిని కాపాడుకునేందుకు డీజిల్ ఇంజిన్ల ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆగస్టులో వర్షాలు కురుస్తాయనే ఆశతో డెల్టా రైతులు ఉన్నారు.
 
కరువు లేదట : పరిస్థితులు ఇలా ఉంటే జిల్లాలో కరువు లేవని జిల్లా యంత్రాంగం చెబుతోంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో కరువు పరిస్థితులు లేవని, పంటలను కాపాడుకునేందుకు డ్రిప్ ఇరిగేష్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement