తీరనున్న రాయలసీమ వాసుల కల

Dream of the residents of Rayalaseema was going to fulfill - Sakshi

స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు పలు కంపెనీల ఆసక్తి

సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెళ్లిన జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులు

రేసులో కొరియా, చైనా కంపెనీలు కూడా

డిసెంబర్‌లో శంకుస్థాపన దిశగా చర్యలు వేగవంతం  

సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల కోరిక తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి విదేశీ కంపెనీలతో పాటు పలు దేశీయ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే దక్షిణా కొరియా స్టీల్‌ దిగ్గజం పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కర్మాగారం ఏర్పాటుపై ఆసక్తిని వ్యక్తీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా జేఎస్‌డబ్ల్యూ గ్రూపు ప్రతినిధులు సైతం కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

ఆ గ్రూపునకు చెందిన మైనింగ్, పోర్టు ప్రతినిధులు వైఎస్సార్‌ జిల్లాను సందర్శించి ఇనుప ఖనిజం లభ్యత, పోర్టు కనెక్టివిటీ వంటి అంశాలను పరిశీలించారు. అనంతరం మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డిని, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్‌ భార్గవను కలిసి చర్చించారు. ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి వెళ్లారని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించడంతో పలు ప్రైవేటు కంపెనీలు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సూచన మేరకు పోస్కో ప్రతినిధులు త్వరలోనే కడపను సందర్శించి ఒక నివేదికను ఇవ్వనున్నారు. ఈ రెండు కంపెనీలతో పాటు చైనాకు చెందిన మరో కంపెనీ కూడా ఆసక్తి చూపిస్తోంది. 

కేంద్రంతో చర్చలు
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రమే ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే దీనిపై కేంద్రం అడిగిన సమాచారం గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తిరిగి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. గతంలో ఇనుప ఖనిజం లభ్యత గురించి కేంద్రం అడిగిన సమాచారంతో పాటు ఇతర వివరాలను ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. దివంగత ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖర రెడ్డి స్వప్నమైన వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటును నిజం చేయాలని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గట్టి పట్టుదలతో ఉన్నారని, ఈ ఏడాది డిసెంబర్‌లోగా శంకుస్థాపన చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top