‘నీ స్నేహం’తో తెరంగేట్రం

‘నీ స్నేహం’తో తెరంగేట్రం


 సత్యం సినిమాలో ‘పులిరాజుకు ఎయిడ్స్ వచ్చింది’  డైలాగ్‌తో గుర్తింపు వచ్చింది

 ఇప్పటి వరకు 250 చిత్రాల్లో నటించా

 ‘న్యూస్‌లైన్’తో సినీ నటుడు సత్యం రాజేష్

 భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్

 సత్యం సినిమాలో ‘పులిరాజుకు ఎయిడ్స్ వచ్చింది’ డైలాగ్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అనతికాలంలోనే మనసు దోచుకున్నాడు. పదేళ్లలో 250 సినిమాలలో పైగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిం చాడు. నటుడిగా గుర్తింపు నిచ్చిన సత్యం సినిమానే ఇంటిపేరుగా మార్చుకొన్న సత్యం రాజేష్ గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా తన సినీ జీవిత విశేషాలను ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు. ఆయన జీవిత విశేషాలు అతని మాటల్లోనే..

 

 ‘‘మాది వైజాగ్. నా అసలు పేరు రాజేష్‌బాబు. మధ్య తరగతి కుటుంబం మాది. నాన్న రాజేంద్రప్రసాద్ టెలికామ్ రిటైర్డ్ ఉద్యోగి, అమ్మ మణికుమారి గృహిణి . ఎంబీఏ వరకు చదువుకొన్నాను. ఆ తరువాత వైజాగ్‌లోని మహీంద్రా కంపనీలో ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్‌కు బదిలీ అయ్యా. ఇక్కడికి వచ్చిన తరువాత సినిమాల్లో అవకాశాలు సాధించాను.

 

 నా మొదటి సినిమా...

 నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. చిరంజీవి వల్లే సినిమాల్లో నటించాలనే ప్రేరణ కల్గింది. ఆయన సిని మాలు బాగా చూసేవాడిని. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం నీ స్నేహం సినిమాకు అడిషన్స్‌లో ఎంపికయ్యాను. హీరో సుమంత్ స్నేహితుడిగా నటించే అవకాశం లభించింది. ఇలా తెరంగేట్రం చేశాను.

 

 సత్యం సినిమాతో గుర్తింపు..

 రెండో సినిమా సత్యం సినిమాలో ‘పులిరాజుకు ఎయిడ్స్ వచ్చింది’ అనే డైలాగ్ ద్వారా నాకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది.  ఈ పదేళ్ల కాలంలో సుమారు 250 ైపైగా సినిమాలలో నటించాను. ప్రేక్షకులు ఆదరించినంత కాలం వారిని నవ్విస్తూనే ఉంటాను. కాగా మిర్చి, వేదం, బలుపు, జల్సా, ప్రేమ కాదలన్ ఇష్క్, నాయక్, ఒక విచిత్రం, అత్తారింటికి దారేది తదితర చిత్రాలు పేరు తెచ్చాయి. భీమవరం బుల్లోడు, రారా కృష్ణయ్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో ఐదారు సినిమాల్లో నటిస్తున్నాను.

 

 బ్రహ్మనందాన్ని ఆదర్శంగా తీసుకుంటా...

 నాకు హీరోగా చేయాలని లేదు. ప్రేక్షకులను నవ్విస్తూ హాస్యనటుడిగా పేరు తెచ్చుకొవాలని ఉంది. హాస్యనటుల్లో బ్రహ్మానందాన్ని ఆదర్శంగా తీసుకుంటాను. అలాగే చిరంజీవి తరువాత పవన్‌కల్యాణ్, రవితేజ నా అభిమాన నటులు. ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, నల్ల వేణు నాతో పాటు వచ్చిన కమెడియన్‌లే.

 

 చిత్ర పరిశ్రమలో అవకాశాలకు కొదవలేదు....

 తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి వంద నుంచి 150 సినిమాలు విడుదల అవుతున్నాయి. టాలెంట్ ఉన్నవారికి ఆలస్యమైన అవకాశాలకు మాత్రం కొదవ లేదు. నిరుత్సాపడకుండా పోటీపడితే విజయం తథ్యం’’.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top