మొత్తానికి రాష్ట్ర భవిష్యత్, ప్రజల భావోద్వేగాల కన్నా తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు మరోసారి నిరూపించారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మొత్తానికి రాష్ట్ర భవిష్యత్, ప్రజల భావోద్వేగాల కన్నా తమ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు మరోసారి నిరూపించారు. అసలు రాష్ర్టం ఇలా రావణ కాష్టంలా మారడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని, కేవలం ఓట్లు, సీట్ల కోస మే ఈ దురాగతానికి పాల్పడిందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ విభజనకు, రాష్ర్టం రగిలిపోడానికి బొత్స కుటుంబీకులే కారణమని ఉద్యమ సంఘాలూ భావిస్తున్నాయి. కేంద్రంలో రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న బొత్స కుటుంబీకులు కనీసం కంటి తుడుపుగానైనా విభజనను వ్యతిరేకించలేదని, కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రాన్ని నిలువునా చీలుస్తుంటే వీళ్లు నోరు మెదపడం లేదని అంటున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా కనీసం వారు ఇప్పటికైనా తమ నిరసనను, వ్యతిరేకతను వ్యక్తం చేయడం లేదు.
విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు పల్లంరాజు, కావూరి సాంబశివరాజు, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవిల్లి అరుణ్‌కుమార్‌తోబాటు రాష్ట్ర మంత్రులు సీ.రామచంద్రయ్య, గంటా తదితరులు రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ దుష్టపన్నాగం వెనుక టీడీపీ హస్తం కూడా ఉందని, టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వలాభం కోసం కాంగ్రెస్‌తో కుమ్మక్కై వారికి వంతపాడుతున్నారని ప్రజలు సైతం నమ్ముతూవస్తున్నారు. అయితే ఏదోవిధంగా విభజన ప్రక్రియను నిలుపుచేస్తారని ఆశించి ఉపాధ్యాయులు రెండు నెలలుగా ఉద్యోగులు జీతాలు మానుకుని, విద్యార్థులు చదువులు మానుకుని ఉద్యమాన్ని తమ భుజాలకెత్తుకుని నడుపుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా బొత్స సత్తిబాబు మాత్రం కిమ్మనకపోవడం పట్ల ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఉండవిల్లి అరుణ్‌కుమార్ సైతం రాజీనామా చేశారు.
ఈ దుర్నీతిని వ్యతిరేకిస్తూ ఉండవిల్లి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్నీ వదులుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎంపీలు గళమెత్తి నిరసన వ్యక్తం చేస్తున్నా సత్తిబాబు కానీ, ఎంపీ ఝాన్సీ కానీ నోరు మెదపకపోవడం ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. తమను బలిపశువులుగా చేసి వారు పదవులు అనుభవిస్తున్నారని, తెలుగుతల్లిని నిలువుగా నరికేస్తున్నా మిన్నకుండిపోయిన సత్తిబాబును, ఆయన కుటుంబాన్నీ జిల్లాకు రానీయబోమని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.