గాయాలతోనే పరీక్షకు.. | Auto Roll Overed And Students Injured | Sakshi
Sakshi News home page

గాయాలతోనే పరీక్షకు..

Mar 24 2018 11:04 AM | Updated on Mar 9 2019 4:28 PM

Auto Roll Overed And Students Injured - Sakshi

పరీక్ష కేంద్రానికి సçహాయకులతో వస్తున్న కృష్ణ ,గాయాలతోనే పరీక్ష రాస్తున్న దీపిక, మహదేవి

కౌతాళం:మండల కేంద్రం సమీపంలో ఆటో బోల్తాపడి నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థుల వివరాల మేరకు..బదినేహల్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 23 మంది పదో తరగతి విద్యార్థులు బస్సు సౌకర్యం లేకపోవడంతో కౌతాళంలో పరీక్షలు రాసేందుకు శుక్రవారం ఉదయం ఆటోలో బయలుదేరారు. మండల కేంద్రం సమీపంలోకి రాగానే ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో దీపిక, మహాదేవి అనే విద్యార్థినుల తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరేష్‌కు ఎడమకాలు, కృష్ణకు చేయి విరిగింది.

విద్యార్థులు ఆఫ్రీన్, శిల్పా, నాగలక్ష్మీ, ఈశ్వరి, కావేరి, నాగమ్మ, అర్షియా, నాగమ్మ, లింగమ్మ, భీముడు, సురేంద్ర, నరసింహా, ఈరన్న, సురేంద్ర, పి.వీరేష్, గోవిందు, ఆటో డ్రైవర్‌ హనుమంతు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు ఘటన స్థలానికి పరుగులు తీశారు.  ఏస్‌ఐ తిమ్మయ్య సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండల వైద్యాధికారి చిదంబరరావు పరీక్ష కేంద్రానికి వెళ్లి గాయపడిన విద్యార్థులకు చికిత్స చేశారు. 

అంబులెన్స్‌లోనే పరీక్ష..
తీవ్రగాయాల పాలైన నలుగురు విద్యార్థులు గాయాలతోనే పరీక్షకు హాజరయ్యారు. కృష్ణ అనే విద్యార్థి చేతికి కట్టుకట్టుకొని పరీక్షకు హాజరవ్వగా, కదలలేనిస్థితిలో ఉన్న వీరేష్‌ పోలీసు బందోబస్తు మధ్య అంబులెన్స్‌లో పరీక్ష రాయడం గమనార్హం.

విద్యార్థులకు భద్రత కరువు..
నదిచాగి, హాల్వి, బాపురం, బదినేహాల్, కామవరం, ఎరిగేరి గ్రామాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తప్పని పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో  విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పుట్టెడు దుఃఖంతో పరీక్షకు..  
మద్దికెర: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరోవైపు తమ్ముడి మరణం.. ఇంత దుఃఖంలోనూ ఆ విద్యార్థి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మద్దికెరకు రామాంజనేయులు, హైమావతి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు శశికుమార్‌ పదో తరగతి, చిన్న కుమారుడు పత్తికొండలోని గురుకులపాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం ఈతకోసం వెళ్లిన తరుణ్‌కుమార్‌ బావిలో పడి మృతి చెందాడు. ఈకమ్రంలో శుక్రవారం తమ్ముడి అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయినా బాధను దిగమింగుకుని శశికుమార్‌ ఫిజిక్స్‌ పరీక్ష రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement