
రాష్ట్ర విభజన జరగదు: ఎంపీ ఉండవల్లి
లోక్‌సభలో తనను తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారని రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
లోక్‌సభలో తనను తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారని రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్ర విభజన జరగదని ఆయన తెలిపారు. తెలంగాణ ఎంపీలను పార్లమెంట్‌లో తాను ఏనాడు అడ్డుకోలేదని చెప్పారు. విభజనపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, సహకరించాలని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు.
సీమాంధ్రలో ఉదృతంగా సాగుతోన్న సమైక్య ఉద్యమాన్ని గురించి ఉండవల్లి లోక్సభలో ప్రస్తావించినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆయనను అడ్డుకున్నారు. తన ప్రసంగంలో ముల్కీ నిబంధనల అంశాన్ని ప్రస్తావించడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రసంగానికి వారు అడ్డుతగిలారు. సీమాంధ్ర ఉద్యమం దేశంలోనే పెద్దదని ఉండవల్లి అన్నారు. రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని విడదీయటం చరిత్రలో ఇదే మొదటిసారి అని తెలిపారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుండటంతో టి కాంగ్ ఎంపీలను కూర్చోవాలని స్పీకర్ మీరాకుమార్ కోరారు. దీంతో గొడవ సద్దు మణిగింది.