అదిగదిగో గ్రామ స్వరాజ్యం.. 

All Arrangements Ready For Grama Sachivalayam In Srikakulam - Sakshi

సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : వచ్చేస్తుంది.. గ్రామ స్వరాజ్య పాలన. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా మరికొద్ది రోజుల్లోనే గ్రామీణాభివృద్ధి పాలన ప్రజల ముంగిటకు రానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న గ్రామ సచివాలయాలను వచ్చే నెల 2న మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం జిల్లా పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు తగు చర్యలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందాలనే ధ్యేయంతో.. నేరుగా వారి ఇంటి ముంగిటకే ప్రగతి ఫలాలు అందాలనే ఆశయంతో ముఖ్యమంత్రి ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలో ముందుగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తూ.. వారి ద్వారానే ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరేలా ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తమ పరిధిలోని ఇంటింటికీ కావాల్సిన ప్రభుత్వ సాయాన్ని తెలుసుకుని, ఆ వివరాలతో నేరుగా గ్రామ సచివాలయానికి తీసుకువెళ్లి, దరఖాస్తు చేయించి, కేవలం 72 గంటల్లోనే పరిష్కారం అయ్యేలా సచివాలయాలు పనిచేయనున్నాయి. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో 12 విభాగాల అధికారులు కొత్తగా విధుల్లోకి చేరనున్నారు. ప్రస్తుతం ఈ నియామకాలపై జిల్లా యంత్రాం గం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈనెలాఖరుకల్లా నియామకాలను పూర్తి చేసి అక్టోబర్‌ 2న సచివాలయాలను ప్రారంభించడానికి సమాయత్తమవుతోంది. 

జిల్లాలో మొత్తం 835 సచివాలయాల ఏర్పాటు 
జిల్లాలో మొత్తం 1141 గ్రామ పంచాయతీలున్నాయి. అయితే కనీసం 2 వేలమంది జనాభాకు ఒక సచివాలయం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు జిల్లాలో మొత్తం 835 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం సచివాలయాలను ఆధునికంగా.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్రజలకు పూర్తి జవాబుదారీతనంగా ఉండేలా.. అవసరమైన మౌలిక సదుపాయాలతో, పచ్చదనంతో ప్రతి సచివాలయం కన్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన ప్రకారం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో మొత్తం 835 సచివాలయాల్లో 719 సచివాలయాలను స్థానికంగా ఉన్న పంచాయతీ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించి, వాటికి అందమైన రంగులతో ఆకట్టుకునేలా చేస్తున్నారు. అలాగే ఆయా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ భవనాల్లో మరో 75 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు, అలాగే అద్దె భవనాల్లో 16 సచివాలయాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. కాగా 25 సచివాలయాలకు పూర్తిగా భవనాల కొరత కన్పిస్తోంది. ఈ ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.  

సచివాలయంలో ఇలా... 
గతంలో ఎన్నడూ చూడని, వినని విధంగా సచివాలయ వ్యవస్థ పనిచేయనుంది. సచివాలయ ఉద్యోగులుగా పంచాయతీ కార్యదర్శితోపాటు పారిశుద్ధ్య, ప్రజారోగ్య, మహిళా రక్షణ, సర్వేయర్, వీఆర్వో.. తదితర 12మంది వరకు అధికార బృందం పనిచేయనుంది. వీరంతా సచివాలయంలో ఉంటూ ఎప్పటికప్పుడు వచ్చిన ఫిర్యాదులు, వినతులపై స్పందించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. గ్రామ వలంటీర్ల సహాయంతో 72 గంటల్లో వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ఇదిలావుంటే సచివాలయ ఆవరణలో పరిశుభ్ర వాతావరణం కల్పిస్తూ.. వచ్చిన ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కూడా చేపట్టనున్నారు.

ఇందుకోసం పంచాయతీ సాధారణ నిధులను ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అలాగే ప్రతి సచివాలయానికి ప్రత్యేకించి రంగులను వేసే ప్రక్రియపై కూడా ఆదేశాలు వచ్చాయి. దీంతో వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న గ్రామ సచివాలయాల్లో టేబుళ్లు 10, కుర్చీలు 30, ఫైల్‌ రాక్స్‌ 6, ఒక గ్రామ సచివాలయ బోర్డు, ఒక ఐరన్‌ సేఫ్‌ (బీరువా)తోపాటు ఆరు నెలల పాటు సచివాలయానికి కావాల్సిన వస్తు సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఒక్కో సచివాలయానికి రూ.1.70 లక్షల వరకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 

అక్టోబర్‌ 2న ప్రారంభం 
జిల్లాలో వచ్చే నెల 2న మండలానికొక మోడల్‌ సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈమేరకు జిల్లాలో మొత్తం 38 పంచాయతీ కేంద్రాల్లో సచివాలయాల కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి సచివాలయ వ్యవస్థ అమలుకు సిద్ధం కానుంది. 

మరొక్క రోజులో..
అరసవల్లి: మరికొన్ని గంటల్లోనే సువర్ణావకాశం చేతుల్లోకి వచ్చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి వేచిచూసిన వారి కష్టాలు తీరనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల 2న ప్రారంభించనున్న గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో వందలాదిమంది వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించారు. వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయి, వివిధ విభాగాల్లో ఉద్యోగులుగా తుదిగా ఎంపికైన అభ్యర్థులకు కలెక్టర్‌ నివాస్‌ చేతుల మీదుగా ఈనెల 28న అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందించనున్నారు. ముందుగా వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలతోపాటు ఫిషరీస్‌ చెందిన అసిస్టెంట్ల పోస్టులకు ఎంపికైన వారికి తొలిదశగా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు జారీ చేయనున్నారు. అలాగే అప్ప టి పరిస్థితుల ఆధారంగా మరిన్ని విభాగాల్లో ఎం పికైన వారికి కూడా ఈమేరకు నియామక పత్రాలను జిల్లా కలెక్టర్‌ నేరుగా అందజేయనున్నారు.  

28, 29 తేదిల్లో కేటగిరి–1 పోస్టుల కాల్‌లెటర్లు! 
గ్రామ/వార్డు సచివాలయాల పోస్టుల్లో భాగంగా కీలకమైన కేటగిరి–1 విభాగంలోని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌–5), వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, మహిళా పోలీస్, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ తదితర నాలుగు పోస్టుల తుది జాబితా తయారు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గురువారం రాత్రికి కొంతమేరకు ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితులు కన్పించినప్పటికీ జిల్లా కలెక్టర్‌ ఆమోద ప్రక్రియ జరిగిన తర్వాతే తుది జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చే అవకాశముంది. దీంతో ఈనెల 28, 29 తేదిల్లో కాల్‌లెటర్లు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏఎన్‌ఎం పోస్టులతో పాటు వీఆర్వో, సర్వేయర్‌ తుది జాబితాలు సిద్ధం కావడంతో ఇప్పటికే కాల్‌లెటర్లను పంపిణీ చేశారు. ఎలాగైనా మిగిలిన అన్ని విభాగాల్లోనూ ఉద్యోగాలకు వెరిఫికేషన్‌ ప్రక్రియలను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలుచేపడుతున్నారు.

నేడు సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఇలా... 
ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో పాటు డిజిటల్‌ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీ సెక్రటరీ, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, ఎడ్యుకేషన్‌ అండ్‌ డాటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ, వీఆర్వో, సర్వేయర్లు, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ తదితర పోస్టులకు శుక్రవారం శ్రీశివానీ, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటు గాయత్రి డిగ్రీ కళాశాలలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ జరగనుంది. ఈమేరకు జిల్లా పరిషత్‌ సీఈవో జి.చక్రధరరావు, డిప్యూటీ సీఈవో ప్రభావతికి ప్రత్యేక సూచనలు, ఆదేశాలనిచ్చారు. 28న వీఆర్వో, గ్రామ సర్వేయర్లు, 28, 29 తేదీల్లో ఏఎన్‌ఎం, వార్డు ఆరోగ్య కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌ను చేపట్టనున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 15 విభాగాల్లో 3867 మందికి కాల్‌లెటర్లు పంపిణీ చేస్తే, గురువారం రాత్రి నాటికి 3603 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లుగా లెక్కలు నమోదయ్యాయి.  

అప్‌లోడ్‌లో తప్పుల సవరణకు మరో అవకాశం 
సచివాలయ పోస్టుల్లో కాల్‌లెటర్లు అందుకున్న వారు తమ కాల్‌లెటర్లును అప్‌లోడ్‌ చేసే క్రమంలో ఏదైనా తప్పులు చేస్తే.. ఏమాత్రం ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్‌ నివాస్‌ భరోసా ఇచ్చారు. గురువారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అప్‌లోడ్‌ విషయంలో తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశమిచ్చిందని, మళ్లీ వెబ్‌సైట్‌లో తమ తప్పులను సరిచేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 15 విభాగాల్లో కాల్‌లెటర్లు జారీ చేశామని, ఇక కేటగిరి–1లోని నాలుగు విభాగాల పోస్టుల భర్తీకి తుది జాబితాలను సిద్ధం చేసే చర్యలు చేపడుతున్నామన్నారు. అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాల విషయంలో ఏమాత్రం ఆందోళన చెందవద్దని, ఇంతవరకు కులధ్రువీకరణ ఉన్నప్పటికీ అనుమతిస్తామని స్పష్టం చేసారు. బెంతు ఒరియా తదితర కులాల ధ్రువీకరణను ఎస్టీలుగా గుర్తించలేమని స్పష్టం చేశారు. పలువురు అభ్యర్థుల జెండర్‌ విషయంలో తేడాగా నమోదైనట్టు ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై ఉన్నతాధికారుల నిర్ణయం కోసం నివేదించామన్నారు. ఈనెల 30లోగా వెరిఫికేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని, అలాగే ముందుగా వెరిఫికేషన్‌ పూర్తయి, ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 28న జిల్లా కేంద్రంలోనే నియామక పత్రాలను అందజేస్తామని ప్రకటించారు.  

కోటబొమ్మాళి, రాజాం ఎంపీడీవోలపై సస్పెన్షన్‌ వేటు 
విధుల్లో నిర్లక్ష్యం చూపినందుకు జిల్లాలో ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ నివాస్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని వారిని గుర్తించిన కలెక్టర్, ఈమేరకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా కోటబొమ్మాళి మండల ఇన్‌ఛార్జ్‌ ఎంపీడీవో రాజేశ్వరమ్మను బుధవారం నాడు, రాజాం ఎంపీడీవో వి.నీరజను గురువారం నాడు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top