ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు చెబుతున్నాయని వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు కుంటిసాకులు చెబుతున్నాయని మండిపడ్డారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణతో కలిసి విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.సెప్టెంబర్ 7న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో పట్టుబట్టిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఎందుకు అభిప్రాయం మార్చుకున్నారని నిలదీశారు. ‘మీ అభిప్రాయాన్ని చంద్రబాబు మార్చారా? రెండున్నరేళ్లలో పరిస్థితులు మారిపోయాయా? వెంకయ్య, చంద్రబాబుకు ఎందుకు సన్మానాలు చేస్తున్నారు. ప్రజలకు ద్రోహం చేసినందుకా. ప్రత్యేక హోదాపై అబద్ధపు కబుర్లు చెబుతూ దొంగ కారణాలు చూపిస్తున్నారు.