రాష్ట్రంలో ప్రత్యేకహోదా జ్వాల రగిలింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం ఓ యువకుడు ఆత్మబలిదానానికి సిద్ధమయ్యాడు. తనువెల్లా అగ్నిజ్వాలల్లో ఆహుతవుతున్నా తెలుగుజాతి వర్ధిల్లాలని,ప్రత్యేకహోదా కల్పించాలని గొంతెత్తి అరిచాడు. పూటకో మాటతో, రోజుకో అబద్ధంతో మభ్యపెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రభుత్వాధినేతల చెవులకు చేరేలా నినదించాడు. విభజన బిల్లులో ప్రత్యేకహోదా పొందుపరచకుండా కాంగ్రెస్‌పార్టీ మోసం చేస్తే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ , రాష్ర్టంలో తెలుగుదేశంపార్టీ ఉమ్మడిగా మభ్యపెడుతున్నాయని నిప్పులు చెరిగాడు. తిరుపతిలో జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువకుని బలిదానయత్నం వార్తలతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు.ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ రూపాల్లో పార్టీలకు అతీతంగా ఉద్యమానికి ఉద్యుక్తులవుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ తిరుపతి మంచాలవీధికి చెందిన బెంగుళూరు మునికామ కోటి అలియాస్ బీఎంకే కోటి (41) ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.