ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లిపోవాలి | Seemandhra workers in Telangana must go back | Sakshi
Sakshi News home page

Aug 3 2013 7:38 AM | Updated on Mar 21 2024 7:53 PM

టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పని చేసే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులంతా కచ్చితంగా ఆంధ్ర ప్రభుత్వానికి వెళ్లిపోవాల్సిందేనన్నారు! ‘ఇక్కడ ఆప్షన్లు, గీప్షన్లు ఉండవ’ని చెప్పారు. ‘‘ఆంధ్రలో కూడా కచ్చితంగా గవర్నమెంట్ నడవాలె. ఆ ప్రాంత ఉద్యోగులంతా ఆ గవర్నమెంట్‌లో పని చేయనీయండి. మన తెలంగాణ ఉద్యోగులు మన గవర్నమెంట్‌లో పని చేస్తరు. మన వాళ్లందరికీ ప్రమోషన్లు వచ్చేస్తయ్’’ అని కూడా చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ముందు ప్రమోషన్లు, తరువాత ఉద్యోగులను సర్దుబాటు చేయటం, ఆ తరువాత కింది స్థాయిలో ఉండే ఖాళీలను భర్తీ చేయటం వరుస వెంబడి జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీఎన్‌జీవో ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఉద్యోగులకు సంబంధించిన టీఎన్‌జీవో సంఘ నాయకులు అడిగే సమాచారాన్ని ఆయా జిల్లాల ఉద్యోగ సంఘ ప్రతినిధులు వెంటనే అందజేయాలని సూచించారు. ‘‘కొన్ని విషయాలపై దేవీప్రసాద్, స్వామిగౌడ్ మీకు కాంటాక్ట్‌లోకొస్తరు. అన్ని సంఘాలకు మనవి చేస్తున్నా. అందరికీ ఒక ర కమైన ఇన్‌స్ట్రక్షన్ వస్తది. నాయకులు అడిగే సమాచారం అందిస్తే, దానికి సంబంధించి చర్యలు తీసుకునే అస్కారం ఉంటది’’ అని పేర్కొన్నారు. వాళ్లు ఎంత సమయంలో వివరాలు కావాలంటే అంత టైంలో సంపూర్ణ వివరాలు అందజేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటేషన్ల పేరుతో తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తన కళ్ల ముందే హైదరాబాద్‌లో వాటర్‌వర్క్స్ శాఖకు సంబంధించి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే టీఆర్‌ఎస్ నాయకులు అండగా ఉండి అడ్డుకున్నారని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement