మిర్చి సాగు చేయలేం | - | Sakshi
Sakshi News home page

మిర్చి సాగు చేయలేం

Dec 3 2025 8:25 AM | Updated on Dec 3 2025 8:25 AM

మిర్చ

మిర్చి సాగు చేయలేం

గిట్టుబాటు ధర కల్పించాలి

ధర లేక తగ్గిన సాగు

లింగపాలెం: మెట్ట ప్రాంతంలో మిర్చి సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. గతేడాది పంట నేటికీ గోడౌన్లలో మగ్గుతోంది. మిర్చి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో సరైన ధర రాక రైతులు అప్పులపాలవుతున్నారు. దీంతో ఈ సంవత్సరం మిర్చి సాగు విస్తీర్ణం గతేడాది కంటే సగానికి పైగానే తగ్గింది. ప్రభుత్వం పట్టించుకోకపోతే మిర్చి సాగు చేయలేమని రైతులు ఖరాకండీగా చెబుతుండడం గమనార్హం.

మిర్చి పంటకు ప్రసిద్ధి

మిర్చి తోటల సాగుకు జిల్లాలోనే మెట్ట ప్రాంతమైన లింగపాలెం మండలం ప్రసిద్ధి. ఈ మండలంలో రైతులే కాకుండా ఇతర మండలాలు, జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి మిర్చి నారును కొనుగోలు చేసుకువెళతారు. ఎకరం మిర్చి సాగు వేయటానికి 9 వేల నుంచి 10 వేల వరకు మిర్చి మొక్కలు అవసరం కాగా, పెట్టుబడులు రూ.లక్షా యాభై వేలు నుంచి రూ.2 లక్షల వరకు అవుతాయని రైతులు అంటున్నారు. లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెం, కొత్తపల్లి, శింగగూడెం, కొణిజర్ల, భోగోలు గ్రామాల్లో ఎక్కువగా మిర్చి సాగు చేస్తారు. ఎకరం పొలంలో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇక్కడ పండించిన పచ్చిమిర్చి కాయలను బొంబాయి, ఢిల్లి, పూనే వంటి ఇతర రాష్ట్రాలకు వ్యాపారస్తులు ఎగుమతులు చేస్తారు. పచ్చిమిర్చి 60 కేజీల బస్తా వచ్చి అప్పటి రేట్లును బట్టి రూ 1,500 నుంచి రూ.2 వేల వరకు ధర పలుకుతుంది. కొందరు రైతులు పచ్చికాయను కోసి అమ్మకాలు చేయగా మరికొందరు పండుకు ఆపి ఎండిమిర్చికి ఉంచుతారు.

సగానికి పైగా తగ్గిన విస్తీర్ణం

గతేడాది సరైన ధర లేకపోవడంతో కొందరు రైతులు పండించిన మిర్చిని నేటికీ విక్రయించలేదు. దీంతో ఈ ఏడాది లింగపాలెం మండలంలో సైతం రైతులు మిర్చి తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. గతేడాది మండలంలో సుమారు 635 ఎకరాల్లో సాగు చేస్తే ఈ ఏడాది 300 ఎకరాల వరకు మాత్రమే రైతులు మిర్చిసాగు చేసినట్లు అధికారుల అంచనా. ధర్మాజిగూడెం ఏరియాలో గతేడాది సుమారు 137 ఎకరాల్లో సాగుచేస్తే, ఈ ఏడాది కేవలం 85 ఎకరాల వరకు సాగుచేశారు. నాణ్యతను బట్టి ఈ ఏడాది మిర్చి క్వింటా రూ.13 నుంచి రూ.14 వేల లోపు ఉందని, కనీసం రూ 20 వేలు పలికితేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో షాపుల్లో ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.

పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చి మిర్చి పంటను సాగు చేస్తున్నాం. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, పైరుకు తెగుళ్లు సోకినా మిర్చి సాగులో నష్టాలు తప్పవు. గతేడాది సరైన ధర కూడా రాలేదు. రైతుల పరిస్థితులను అర్ధం చేసుకుని ప్రభుత్వం గిట్టుపాటు ధర కల్పిస్తేనే మిర్చి సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తారు.

– సీహెచ్‌ మారేశ్వరరావు, రైతు, కొణిజర్ల

గత రెండేళ్లగా మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. దీంతో మిర్చి సాగుపై ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. నేను గతంలో 6 ఎకరాలు సాగు చేసేవాడిని. ప్రస్తుతం రెండు ఎకరాలు సాగు చేశా. ఎకరం కౌలుకు రూ 2.5 లక్షలు పెట్టుబడులు అవుతున్నాయి. ఎరువులు, కూలీలు, పురుగు మందులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి.

– ఎస్‌ సాంబయ్య, కౌలు రైతు, ధర్మాజీగూడెం

మెట్ట రైతుల అనాసక్తి

ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై నిరుత్సాహం

గోడౌన్లలో మగ్గుతున్న గతేడాది పంట

అప్పుల పాలైన రైతులు

మిర్చి సాగు చేయలేం 1
1/2

మిర్చి సాగు చేయలేం

మిర్చి సాగు చేయలేం 2
2/2

మిర్చి సాగు చేయలేం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement