భీమవరం: లాడ్జిలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భీమవరం ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. పట్టణంలోని నాచువారి సెంటర్‌కు చెందిన అడబా శివ అలియాస్ పైరు శివ(40) ప్రస్తుతం గొల్లలకోడేరు సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. రొయ్యల వ్యాపారం చేస్తూ ఇటీవల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. సోమవారం లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం సాయంత్రం లాడ్జి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎస్సై బీవై కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
నూజివీడు: పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థినులకు క్రీడా కోటాలో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు లభించాయి. పట్టణానికి చెందిన బేతాళ ప్రభుదీపిక, షేక్ ఆశ్రా, బుర్రె ప్రణవి క్రీడా కోటా కింద ట్రిపుల్ ఐటీలో సీటు కోసం ఈ ఏడాది జూన్ నెలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే శాప్ నిర్లక్ష్యం కారణంగా వీరికి సీట్లు రాలేదు. దీనిపై వీరు బాస్కెట్‌బాల్ కోచ్ సాయంతో తమకు జరిగిన అన్యాయాన్ని శాప్ ఎండీ ఎస్ భరణి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎండీ పునర్విచారణ చేసి ట్రిపుల్ ఐటీకి సీట్లు ఇవ్వమని లెటర్ పంపడంతో డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ ముగ్గురికి అడ్మిషన్లు ఇచ్చారు.
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ విద్యార్థిని వాడవలస దివ్యశ్రీ (8వ తరగతి), జాతీయస్థాయి జూనియర్ రగ్బీ, విద్యార్థి కంచర్ల రామచైతన్య (9వ తరగతి) జూనియర్స్‌లో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల గన్నవరం, కొవ్వూరులో జరిగిన నేషనల్ క్వాలిఫైయింగ్ పోటీల్లో వీరు ప్రతిభ కనబర్చారు. మంగళవారం హైస్కూల్‌లో జరిగిన అభినందన సభలో ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ విద్యార్థులను, పీడీలు భూదేవి కామేశ్వరిని అభినందించారు. పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్, స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నబీ, ఫిజికల్ డైరెక్టర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ద్వారకాతిరుమల: కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ మీదకు దూసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం భీమడోలు–ద్వారకాతిరుమల క్షేత్ర ప్రధాన రహదారిలోని తిమ్మాపురం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ భక్తుడు కుటుంబ సభ్యులతో కలసి తన కారులో భీమడోలు వైపు నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి, రోడ్డు మధ్యలోని డివైడర్ మీదకు దూసుకెళ్లింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో, ప్రమాదం జరిగిన సమయంలో ఏవిధమైన వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. అలాగే కారులో ఉన్న వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య


