‘చెత్త’శుద్ధి ఎక్కడ?
వైఎస్సార్‌సీపీ పాలనలో రీసైక్లింగ్ పనులు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అభివృద్ది శూన్యం. రెండ్రోజుల క్రితం మంత్రి పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాలు పరిశీలించారు. రామయ్యహాలు వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించి జగన్‌మోహన్ రెడ్డి వల్లే అభివృద్ధి జరగలేదు. తమ ప్రభుత్వం డంపింగ్ యార్డు శాశ్వత పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రకటించారు.
పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా 2023 అక్టోబర్‌లో పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. పట్టణ జనాభా సుమారు 80 వేలు కాగా రోజుకు పట్టణంలో దాదాపుగా 40 టన్నుల పైగా చెత్త సేకరణ జరుగుతుంది. చెత్త పేరుకుపోవడంతో యడ్లబజారు, రామయ్యహాలు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు కొండల్లా ఉన్నాయి. పట్టణంలో విలీన గ్రామాల విలీనం మొదలైతే డంపింగ్ సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉందని గ్రహించి నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో డంపింగ్ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. రీ సైక్లింగ్ చేసే ప్రాసెసింగ్ యూనిట్ అంతా ఒక చోట ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం యలమంచిలి మండలం కొంతేరులో సుమారు నాలుగెకరాలు భూమిని కొనుగోలు చేయించింది. కొందరు తమ రాజకీయ లబ్ధికోసం ఇక్కడ చెత్త కేంద్రం పెడితే అంతా దుర్వాసన వచ్చేస్తుందని ప్రచారం చేసి కొందరిని కోర్టుకు పంపి అక్కడ చెత్త రీ సైక్లింగ్ యూనిట్ పెట్టకుండా నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. అదే కేసును ప్రస్తుతం తీసేయమని కేసు వేసిన వ్యక్తిని పట్టుబడుతున్న కూటమి నాయకుడు ఎవరు...? దీనికి సమాధానం మాత్రం బహిరంగంగా చెప్పే సాహసం చేయలేకపోతున్నారు.
యడ్లబజారులో పేరుకుపోయిన చెత్త
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తరుణ్ ఏజెన్సీ ద్వారా లెగసీ వేస్ట్ రీ సైక్లింగ్ పనులు ప్రారంభించారు. ఈ పనులు జూన్‌లో ప్రారంభం అయ్యాయి. రామయ్య హాలులో పనులు చేస్తున్నారు. అక్కడ పూర్తయ్యేలోపు యడ్ల బజారులో మళ్లీ చెత్త కొండలా పేరుకుపోయింది. కొండలా తయారైతే చెత్త వాహనాలు పైకి ఎక్కే పరిస్థితి లేకపోవడంతో చెత్తను పొక్లెయిన్‌తో చదును చేయించారు. ఈ ప్రక్రియలో చెత్తను చదును చేయడంతో పట్టణం దక్షిణ భాగంలో ఉన్న ప్రజలు దుర్వాసన భరించలేక గగ్గోలు పెట్టారు. నెల రోజులుగా దుర్వాసనతో ప్రజలు గగ్గోలు పెడితే పట్టించుకోని మంత్రి, కూటమి నేతలు నేడు అభివృద్ధి తమ వల్లే జరుగుతుందన్నట్లు ప్రగల్బాలు పలకడం పట్టణ ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
త్వరలో పనులు పూర్తి
పాలకొల్లులో త్వరలో లెగసీ వేస్ట్ రీ సైక్లింగ్ పనులు పూర్తవుతాయి. ఈ పనులు జరుగుతుండగానే కంపోస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. ఈ యూనిట్ కోసం జిల్లాకు రూ.38 కోట్లు మంజూరైంది. ఇందులో పాలకొల్లు పట్టణానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. జనవరి నెలాఖరుకు డంపింగ్ యార్డుల్లో షెడ్లు ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ ప్లాంట్ తయారు చేస్తాం. ఈ యూనిట్ వల్ల చెత్త సమస్య ఉండదు. ఏ రోజుకారోజు చెత్తను ప్రాసెసింగ్ చేయడం ద్వారా చెత్త నిల్వ ఉండే పరిస్థితి ఉండదు.
– విజయ్, పబ్లిక్ హెల్త్ డీఈ, భీమవరం
నాడు యడ్లబజారులో డంపింగ్ యార్డులో సుమారు 30 వేల టన్నులు, రామయ్య హాలులో సుమారు 25 వేల టన్నుల చెత్త ఉంటుందని మునిసిపల్ అధికారులు అంచనాలు వేశారు. రీ సైక్లింగ్ ప్రాసెస్ యూనిట్‌ను గుంటూరుకు చెందిన అవినాష్ ఏజెన్సీస్ సంస్థకు అప్పగించారు. 2023 అక్టోబర్‌లో ఈ సంస్థ పట్టణంలో యడ్లబజారు సెంటర్‌లో ఉన్న డంపింగ్ యార్డులో రీ సైక్లింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేశారు. రోజుకు సుమారు 300 నుండి 500 టన్నులు వరకూ రీ సైక్లింగ్ చేసేవారు. 2024 ఫిబ్రవరి నాటికి యడ్లబజారు సెంటర్‌లో ఉన్న 30 వేల టన్నుల చెత్తను 90 శాతం రీ సైక్లింగ్ పూర్తిచేశారు. రామయ్యహాలు వద్దకు వెళ్లేసరికి ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిపేశారు. ఎన్నికల తరువాత పనులు ప్రారంభిస్తుండగా కూటమి ప్రభుత్వం పనులను నిలుపుదల చేయించింది. ఎందుకు ఆపేశారని నాడు పట్టణ ప్రజలు ప్రశ్నించగా ఆ ఏజెన్సీ తప్పుకుందని మరో ఏజెన్సీ వస్తుందని చెప్పారు. పనులు చేయిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చేయిస్తుందని ప్రజల్లోకి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో నాడు పనులు నిలుపుదల చేయించినట్లు సమాచారం. మరి కూటమి నేతలకు రాజకీయ స్వార్దం లేకపోతే పనులు కంటిన్యూ చేయించి ఉంటే నేటికి పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య లేకుండా పోయేది కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో పాలకొల్లులో డంపింగ్ యార్డ్ రీసైక్లింగ్ పనులు
చంద్రబాబు ప్రభుత్వం రాగానే పనుల నిలిపివేత
దుర్వాసన భరించలేకపోతున్నామని ప్రజల గగ్గోలు
‘చెత్త’శుద్ధి ఎక్కడ?
‘చెత్త’శుద్ధి ఎక్కడ?


