పంటను ముంచేశారు
పొలాల్లోకి చొచ్చుకొచ్చిన అజ్జమూరు చానల్ నీరు
ఆకివీడు: అధికారుల నిర్లక్ష్యం, నీటి సంఘాల అసమర్థత వల్ల మండలంలోని అజ్జమూరు, కుప్పనపూడి, కాళ్లకూరు, దొడ్డనపూడి, జువ్వలపాలెం తదితర ప్రాంతాలోని చేతికందివచ్చిన పంట నీటి పాలయ్యే పరిస్థితి నెలకొంది. వెంకయ్య వయ్యేరు పంట కాలువ వద్ద నుంచి ఆయా గ్రామాలకు నీరు సరఫరా చేసే అజ్జమూరు చానల్ తూరలో ఉన్న చెత్తను తొలగించడంతో ఒక్కసారిగా పంట కాల్వలోని నీరు అజ్జమూరు చానల్‌లోకి చొచ్చుకుపోయింది. దీంతో సమీపంలోని పంట బోదెల ద్వారా ముంపునీరు కోతకు సిద్ధం చేసిన పొలాల్లోకి చొచ్చుకుపోయింది. దీంతో రైతులు అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులకు తెలియజేసినా ఫలితం లేదు. రాత్రి వరకూ నీరు చొచ్చుకుపోవడంతో కోతకొచ్చిన పంట చేలు నీట మునిగి, తీవ్ర నష్టానికి గురవుతామని చెబుతున్నారు. అజ్జమూరు చానల్ ఆయుకట్టులోని వేలాది ఎకరాల పంట కోతకు సిద్ధంగా ఉంది. గత మూడు రోజులుగా దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. దీంతో కోత కోయడం ఇబ్బందికరంగా ఉండటంతో మాసూళ్లు పూర్తి చేయలేదు. తయారైన గింజ భారీ వర్షం కురిసినా, ఈదురుగాలులు వీచినా రాలిపోతాయని చెబుతున్నారు. అజ్జమూరు చానల్ నుంచి చొచ్చుకుపోయిన నీటివల్ల వరి కాండం కుళ్లిపోయి కంకులు నేలకొరగడం, గింజ రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు.


