నాటక రంగ పురోభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
వీరవాసరం: తోలేరులో శ్రీ వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా ఏర్పాటు చేసిన నాటక పోటీలు మంగళవారం ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ సభకు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామన్నారు. నాటక రంగ పురోభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వివరించారు. టీచర్స్ ఎమ్మెల్సీ గోపీ మూర్తి మాట్లాడుతూ నాటక రంగం ద్వారా సమాజంలో మార్పులు చోటుచేసుకుంటున్నా యని పేర్కొన్నారు. సభలో సినీ, రంగస్థల నటుడు కోట శంకరరావు, కళా పరిషత్ సమాఖ్య రాష్ట్రీయ అధ్యక్షుడు బుద్ధాల వెంకట రామారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సినీ రంగస్థల అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ, కళా పరిషత్ అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణ మూర్తి, ఆరేటి ప్రకాష్, రాయప్రోలు భగవాన్, తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య అకస్మాత్తుగా సెలవుపై వెళ్లారు. దీంతో మంగళవారం జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాయిదా పడింది. సాక్షిలో పర్సంటేజీల బాగోతం శీర్షికన ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపధ్యంలో కీలకమైన కౌన్సిల్ సమావేశం ఉన్న తరుణంలో కమిషనర్ సెలవు పెట్టడం, మిగిలిన అధికారులు ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరించడం చర్చనీయాంశమైంది.
భీమవరం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాల్లో ఈ నెల 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణపై జిల్లా, డివిజనల్, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడారు. తల్లిదండ్రులకు విద్యార్థి విద్యా ప్రమాణాలు వివరించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: దిత్వా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడవకుండా భద్రపర్చుకోడానికి రైతులకు సహకార సంఘాలు, రైతు సేవాకేంద్రాల్లో 11 వేల బరకాలు అందుబాటులో ఉంచినట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మంగళవారం తెలిపారు. గ్రామాల్లో బరకాలు అద్దెకిచ్చేవారిని గుర్తించి వారినుంచి అద్దె ప్రాతిపదికన సేకరించామన్నారు. ఇప్పటికే రైతులు 2,750 బరకాలు ఉపయోగించుకున్నారని ధాన్యం కళ్లాల్లో ఉన్న రైతులు దగ్గరలోని సహకారసంఘాలు, రైతు సేవాకేంద్రాల నుంచి ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా బరకాలు తీసుకుని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఏపీఎన్‌జీఓ అసోసియేషన్ పశ్చిమగోదావరి జిల్లా అడహక్ కమిటీని బుధవారం నియమిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చోడగిరి శ్రీనివాసరావు, ఎన్.రామారావు తెలిపారు. భీమవరంలోని త్యాగరాజ భవనంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని రవాణా వాహనాల యజమానులు తమ వాహనాలకు ఫిట్‌నెస్ చేయించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్‌ఎంవీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాల ఫిట్‌నెస్ కోసం మచిలీపట్టణం, రాజమండ్రి, అమలాపురం లేదా తమకు దగ్గరలో ఉన్న ఏటీఎస్ సెంటర్‌లలో వాహన ఫిట్‌నెస్ చేయించుకోవాలని సూచించారు.


