వర్షంతో రైతన్న ఇక్కట్లు
భీమవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను జిల్లాలోని రైతులకు కంటి మీదు కునుకు లేకుండా చేస్తోంది. గత మూడు రోజులుగా మబ్బులు, చినపాటి చినుకులతో భయపెట్టిన వాతావరణం మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా మోస్తరు వర్షం కురవడంతో రైతులు పంటను కాపాడుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 2.15 లక్షల ఎకరాల్లో సార్వా వరిసాగు చేయగా గత నెలాఖరునాటికి సుమారు లక్ష ఎకరాల వరకు పంటను మాసూలు చేశారు. ఎక్కువ శాతం ధాన్యం కళ్లాలపైనే ఉండడంతో ఆరబెట్టుకోడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తుపాను ప్రభావం పెద్దగా ఉండదని భావించిన రైతులు వరి కోత యంత్రాలతో పంటను మాసూలు చేసి ధాన్యాన్ని ఒడ్డుకు తెచ్చారు. ఆది, సోమవారాల్లో వర్షం లేకపోవడంతో ధాన్యాన్ని గాలికి ఆరబెట్టుకున్నారు. మంగళవారం ఉదయం కూడా అనేక మంది రైతులు ధాన్యం రాశులపై బరకాలు తీసి ఎండబెడుతున్న క్రమంలో చిన్నపాటి చినుకులు ప్రారంభం కావడంతో రాశులను తిరిగి బరకాలతో కప్పి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం చినుకులు తగ్గకపోవడంతో తిరిగి ఎండబెట్టే అవకాశం లేకుండా పోయింది. వరి కోత యంత్రాల ద్వారా మాసూలు చేసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎండబెట్టకపోతే ధాన్యం రంగుమారిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సార్వా సీజన్ ప్రారంభం నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదని మోంథా తుపాను నష్టం తెచ్చిపెట్టిందని వాపోతున్నారు. మిగిలిన పంట సక్రమంగా చేతికి అందకుండా వర్షంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షంతో రైతన్న ఇక్కట్లు


