ఆలయానికి పోటెత్తిన భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ షష్ఠి ఉత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారి పుట్టలో పాలు పోసి దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సమయం క్యూలైన్లలో వేచి ఉండాల్సివచ్చింది. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి క్యూలైన్లలో నిలబడి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద పూజలు చేసేందుకు మహిళలు పోటెత్తారు. గోశాల వద్ద సైతం భక్తులు అధిక సంఖ్యలో గోవులకు పూజలు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత కష్ణప్రసాద్ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.


