తణుకులో టెర్రర్
● ఇటీవల పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు
● మారణాయుధాలతో తెగబడి చోరీలు
తణుకు అర్బన్: హత్యలు, ఆత్మహత్యలతోపాటు భారీ చోరీలకు తణుకు పట్టణం, రూరల్ ప్రాంతాలు కేరాఫ్‌గా మారాయి. ముఖ్యంగా పక్కా ప్రణాళికతో హత్యలు చేయడం ఇటీవల వెలుగుచూశాయి. తణుకులో శాంతిభద్రతల లోపించడంపై ప్రజల్లో చర్చ సాగుతోంది. తణుకులోని పైడిపర్రు సంజయ్ నగర్‌లో స్నేహితుల మధ్య ఏర్పడ్డ తగాదాల్లో శిరాళం ప్రభాకర్‌ను కందుల శ్రీను, అతని స్నేహితుడు కాపకాయల గణేష్ సాయంతో హత్యచేయడం తణుకు ప్రాంతంలో తీవ్ర అలజడి రేపింది. ఏకంగా ఇంట్లోకి వచ్చి పడుకున్న వ్యక్తిని చాకుతో విచక్షణారహితంగా పొడిచి చంపడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళన చెందారు. సెప్టెంబరు నెలలో తాడేపల్లిగూడెంకు చెందిన యువకుడు మడుగుల సురేష్ తణుకులో హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది జనవరిలో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వీఆర్‌లో ఉన్న ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం, కొమ్మాయిచెర్వు గట్టు ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి మరీ దంపతులపై కత్తితో దాడికి చేయడం వంటివి కలకలం రేపాయి. మద్యం దుకాణం నైట్ పాయింట్‌లో దుకాణదారుడిపై ఒక వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడిచేయడం వంటి ఘటనలతోపాటు సెప్టెంబరు 27న రాత్రి తణుకులో వృద్ధురాలిని బెదిరించి 70 కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేయడం ఆందోళన రేకెత్తించాయి. దుండగులు ఉపయోగించిన మారణాయుధాలు ఒళ్లుగగుర్పొడిచేలా ఉండడం వంటి ఘటనలు పోలీసు విధి నిర్వహణకు సవాల్‌గా నిలుస్తున్నాయి.
భయాందోళనలో తణుకు వాసులు
హత్యలు, దాడులు, చోరీలు వంటి వరుస ఘటనలతో తణుకు పట్టణం, రూరల్ ప్రాంతాల్లోని ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నారు. సంజయ్ నగర్‌లో జరిగిన హత్యకు కొన్ని రోజుల ముందు స్నేహితుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో శ్రీనుపై ప్రభాకర్ దాడిచేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రభాకర్ తనకు ప్రాణభయం ఉందని తనను శ్రీను చంపేస్తాడని పోలీసులను ఆశ్రయించినప్పటికీ పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని బాధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నప్పటికీ బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరగడంలేదని వాపోతున్నారు. వరుస ఘటనలు జరగడంతో ప్రజానీకం చిన్నపాటి గొడవలకే భయపడే పరిస్థితి దాపురించింది. ఇటీవల వరుస బందోబస్తుల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లడంతో స్టేషన్‌లు ఖాళీ అవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు నైట్ బీట్‌లు, పెట్రోలింగ్ వంటివి పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారనేది ప్రజల వాదన.
ఇంట్లో రక్తపు మరకలు.
తణుకులో ప్రభాకర్ హత్యకు గురైన ఇల్లు
తణుకులో టెర్రర్


