బాబు పాలనలో భరోసా శూన్యం
ఏలూరు (టూటౌన్): ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికి ఎలాంటి పథకాలు లేకపోవడంతో వారికి ఆర్థికంగా భరోసా శూన్యంగా మారింది. వైఎస్సార్‌సీపీ గత ఐదేళ్ళ పాలనలో మహిళల స్వయం సమృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలు అందిస్తూ వారి ఎదుగుదలకు అండగా నిలబడి ఊతం ఇచ్చింది. మహిళా సాధికారతే ధ్యేయంగా నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్ద ఎత్తున మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేసేందుకు కృషి చేశారు. డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు అందించారు. మహిళలను ఆర్థికంగా శక్తివంతుల్ని చేసే క్రమంలో వారికి ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, చేదోడు, జగనన్న తోడు వంటి పలు సంక్షేమ పథకాలు అక్కరకు వచ్చాయి. చిరు వ్యాపారాలు, డెయిరీ యూనిట్లు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం, కుటీర పరిశ్రమల నిర్వహణ వంటివి చేపట్టారు. నేడు ఆ పరిస్థితి లేదు.
ఐదేళ్ళల్లో రూ.13,451.50 కోట్ల రుణాలు
వైఎస్సార్‌సీపీ పాలన ఐదేళ్ళలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో రూ.13,451.50 కోట్లు బ్యాంకు రుణాలను డ్వాక్రా మహిళలకు అందించారు. ఏలూరు జిల్లాలో 1,42,456 గ్రూపులకు సంబంధించి రూ.7,682.40 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,04,576 గ్రూపులకు రూ.5,753.10 కోట్లు రుణాలుగా అందించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మహిళల స్వయం సమృద్ధికి ఏ స్థాయిలో పనిచేసిందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఈ స్థాయిలో బ్యాంకుల నుంచి మహిళలకు రుణాలు అందడం లేదు.
ఏటా లక్ష్యానికి మించి రుణాలు
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో డ్వాక్రా సంఘాలకు ఏటా నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేశారు. క్షేత్ర స్థాయిలో చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ డ్వాక్రా సంఘాలకు మెరుగైన సహకారం అందించేందుకు కృషి చేశారు. ఏలూరు జిల్లాలో సగటున ఏటా 164.89 శాతం మేరకు మహిళలకు డ్వాక్రా రుణాలు అందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సగటున 177.69 శాతం బ్యాంకు రుణాలు అందించారు.
ఆసరా పథకంలో రూ.2,300 కోట్ల లబ్ది
వైఎస్సార్ ఆసరా పథకంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని డ్వాక్రా మహిళలకు రూ.2,300 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా మహిళలకు రూ.1377.16 కోట్ల రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. పశ్చిమగోదావరి జిల్లాలో మూడు లక్షల మందికి పైగా మహిళలకు రూ.వెయ్యి కోట్ల మేరకు లబ్ది కలిగింది.
కాపు నేస్తంలో రూ.220 కోట్ల ప్రయోజనం
వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో ఒక్కో ఏడాది రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో లబ్ధిదారులకు రూ.60 వేల ఆర్థిక సహకారం అందించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కాపు మహిళలకు రూ.220 కోట్ల మేరకు లబ్ది చేకూరింది. ఏలూరు జిల్లాలోని కాపు మహిళలు 66,488 మందికి రూ.100.45 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలోని లక్ష మంది మహిళలకు రూ.1,20 కోట్ల మేరకు సహకారం లభించింది.
వైఎస్సార్ చేయూతలో రూ.850 కోట్ల లబ్ధి
వైఎస్సార్ చేయూతలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని మహిళలకు రూ.850 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఏలూరు జిల్లాలో 1,00,776 మందికి నాలుగు విడతల్లో రూ.440 కోట్ల మేరకు ప్రయోజనం చేకూరింది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 95 వేల మంది మహిళలకు రూ.410 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది.
అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం
వైఎస్సార్‌సీపీ పాలనలో అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు విడతల్లో రూ.45 వేల ఆర్థిక సహకారం అందించారు. ఏలూరు జిల్లాలో 15,047 మందికి రూ.68.68 కోట్లు అందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 14 వేల మందికి రూ.63 కోట్ల మేర లబ్ది చేకూరింది.
చంద్రబాబు పాలనలో కళతప్పిన మహిళలు
నాడు వైఎస్సార్సీపీ పాలన ఐదేళ్ళల్లో మహిళలే మహారాణులుగా వెలుగొందారు. దానికి భిన్నంగా ప్రస్తుత చంద్రబాబు కూటమి పాలనలో మహిళలకు భరోసా లేదు. ఆర్థిక భరోసా కోల్పోయి ఎప్పటి లాగానే ప్రతీ చిన్న అవసరానికి ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఏదో పథకం ద్వారా మహిళల చేతుల్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నాటి వైఎస్సార్ సీపీ హాయాంలోని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే బాగుందని నేడు తమకు ఏ పథకం అందక పోవడంతో ఖర్చులకు వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు అందని ఆర్థిక భరోసా
వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలే మహారాణులు
చేయూత, కాపు నేస్తం, ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో భరోసా
బ్యాంకు రుణాలు, సీ్త్ర నిధి రుణాలు అందజేత


